రైతుబీమా నమోదులో ఆసక్తి


ముందుకొస్తున్న రైతులు
హైదరాబాద్‌,ఆగస్ట్‌10(జనం సాక్షి): జిల్లాల్లో రైతుబీమా పక్రియ వేగంగా సాగుతోంది. బీమా అమలు కానుండడంతో రైతులు కూడా ఆస్తి చూపుతున్నారు. అధికారులకు అడిగిన సమాచారాన్ని ఇస్తున్నారు. రైతుబంధు సాయం అందడంతో ఇప్పుడు వీరిలో భరోసా పెరగింది. ఈ పథకంలో గ్రామాల్లోని 18 నుంచి 59 ఏళ్ల వయస్సున్న రైతులు అర్హులు కాగా.. బీమాకు అవసరమైన ప్రీమియం ప్రభుత్వం చెల్లిస్తుంది. రైతు ఏ కారణంతో చనిపోయినా ఆ కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడకుండా బీమా పరిహారంలో రూ.5 లక్షలు అందజేస్తారు. ఇటీవల భూ సమగ్ర సర్వేలో సేకరించిన వివరాల ఆధారంగా రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ వివరాలు ఆధారంగా జిల్లాల్లో బీమా ప్రింటెడ్‌ పత్రాలను అధికారులు క్షేత్రస్థాయి సిబ్బందికి పంపిణీ చేశారు. జిల్లాలో ఇందుకు సంబంధించిన పక్రియ ను పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. గ్రామాల్లోని రైతు కుటుంబాల్లో నామినీని నిర్ధారణ చేస్తూ నామినేషన్‌ ఫారంపై పట్టాదారు సంతకం తీసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా పూర్తి స్థాయి వివరాలు సేకరిస్తామని అధికారులు అంటున్నారు. గ్రామాల్లోని రైతు సమన్వయ సమితుల సభ్యులు అధికారులకు సహకారం అందిస్తున్నారు. గ్రామాల్లోని రైతులు అధికారులకు పట్టాదారు పాసుపుస్తకాల్లోని వివరాలు, ఆధార్‌కార్డు, నామినీ, ఇతర విషయాలను చెబుతున్నారు.