రైతులను అన్ని విధాల ఆదుకుంటాం

– మరో రెండురోజులు పెనుగాలులు, వర్షాల ప్రభావం ఉంటుంది
– నాలుగు జిల్లాల్లో 56,976 హెక్టార్లలో పంట దెబ్బతింది
– తుఫాన్‌ తీవ్రతపై సీఎం ఎప్పటికప్పుడు సవిూక్షిస్తున్నారు
– విలేకరుల సమావేశంలో మంత్రి దేవినేని ఉమ
విజయవాడ, డిసెంబర్‌17(జ‌నంసాక్షి) : తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు కృష్ణా జిల్లాలో పంటలు దెబ్బతిన్నాయని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో  మాట్లాడారు.. తుఫాను తీవ్రతపై సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు సవిూక్షిస్తున్నారన్నారు. రెండ్రోజుల పాటు పెనుగాలులు, వర్షాలు పడతాయని అన్నారు. భారీ వర్షాలకు నాలుగు జిల్లాల్లో 56,976 హెక్టార్లలో పంట దెబ్బతిందని చెప్పారు. తూర్పు గోదావరి 11,933 హెక్టార్లు, పశ్చిమ గోదావరిలో 1,410 హెక్టార్లు, కృష్ణా జిల్లాలో 20, 740 హెక్టార్లు, అదేవిధంగా గుంటూరు జిల్లాలో 22,523 హెక్టార్లు దెబ్బతిన్నట్లు అధికారులు అంచనా వేసినట్లు తెలిపారు. మరో రెండు రోజుల పాటు తుఫాన్‌ ప్రభావం ఉంటుందని, పూర్తిస్థాయి పంట నష్టం అంచనా వేసి తదనుంగా నష్టాన్ని అంచనా వేస్తామని తెలిపారు.  పంట నష్టపోయిన రైతులను ఆదుకొనేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని, రైతులు ఎలాంటి అధైర్య పదవద్దని  మంత్రి దేవినేని ఉమ స్పష్టం చేశారు. తుఫాన్‌ తీరం దాటిన తరువాత కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు సమాచారాన్ని చేరవేస్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా అధికారులు అప్రమత్తమయ్యారని అన్నారు. సహాయ కేంద్రాల ద్వారా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని విభాగాల అధికారులు, మంత్రులు పర్యవేక్షిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇరిగేషన్‌ ప్రాజెక్టుల వద్ద కూడా వర్ష తీవత్రను బట్టి అప్రమత్తంగా ఉండాలని సంబంధిత శాఖ అధికారులకు సూచించినట్లు తెలిపారు. ఏ ప్రాజెక్టుల పరిధిలో ఎంత వర్షపాతం పడుతుంది అనే దానిపై వివరాలు అందించాలని ఇప్పటికే ఆదేశించినట్లు తెలిపారు. వర్షద్వారా వచ్చిన నీటిని రిజర్వాయర్లకు తరలించేలా చర్యలు తీసుకోవాలని సూచించినట్లు తెలిపారు. తూర్పు, పశ్చిమ గోదావరి, గుంటూరు, విజయనగరం, విశాఖపట్టణం ప్రాంతాల్లో మరో రెండు రోజులు భారీ వర్సాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రాజెక్టుల వద్ద అప్రమత్తంగా ఉండాలని ఇరిగేషన్‌ శాఖ అధికారులకు సూచించినట్లు మంత్రి దేవినేని తెలిపారు.