రైతులు దేవుడికి ప్రతిరూపం

 

– అలాంటి వారికి ప్రభుత్వాలు అండగా నిలవాలి

– వైఎస్‌ సెజ్‌ల పేరుతో పంట భూములు లాక్కున్నాడు

– చంద్రబాబు రైతులను పట్టించుకోవడం లేదు

– సమస్యలతో రైతులు బాధపడుతున్నారు

– పోరాట యాత్రలో రైతన్నలతో జనసేనాని భేటీ

– రైతులతో ముఖాముఖిలో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌

కాకినాడ, నవంబర్‌26(జ‌నంసాక్షి) : దేశానికి అన్నంపెట్టే రైతులంటే దేవుడికి ప్రతిరూపం అని, కానీ నేతల తీరుతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి వస్తుందని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో పోరాట యాత్రలో భాగంగా జనసేనాని సోమవారం రైతులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పంటకు మద్దతు ధర, ఎరువులు, మార్కెట్‌ సౌకర్యాలు, దళారుల వ్యవస్థ, గిడ్డంగుల వసతి తదితర అంశాలపై రైతన్నల సమస్యలను పవన్‌ సానుకూలంగా విన్నారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి పచ్చని చెట్లు అంటే తనకు చాలా ఇష్టమని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఓసారి తమ ఇంటి దగ్గర మామిడి చెట్టును కొట్టివేస్తే తనకు చాలా ఏడుపు వచ్చిందని తెలిపారు. మళ్లీ ఆ చెట్టు ఎప్పుడు పెరిగి పచ్చగా మారుతుందో అని అప్పట్లో బాధపడ్డానని గుర్తుచేసుకున్నారు. అలాంటిది ఇప్పుడు ఆధునికీకరణ పేరుతో దేశమంతా విధ్వంసకరమైన ప్రగతి సాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన పార్టీని 2014లో ప్రజల ముందుకు తీసుకురావడం చాలా సాహసోపేతమైన చర్య అని అభిప్రాయపడ్డారు. కానీ ప్రజలకు సేవ చేసేందుకు, ధర్మపోరాటం కోసం పార్టీని స్థాపించానన్నారు. వైఎస్‌ ముఖ్యమంత్రి అయ్యాక సెజ్‌ ల పేరుతో ఏటా 3 పంటలు పండే భూమిని లాక్కుని రైతులను రోడ్డుపై పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు రైతులను ఎందుకు రక్షించడం లేదని తన మనసులో ప్రశ్నలు ఉదయించేవని చెప్పారు. 2006-07లో తెలంగాణలో ఓ రైతన్న పెట్టిన కన్నీరు తనకు ఇంకా గుర్తుందని ఆవేదన వ్యక్తం చేశాడు. ‘ఊర్ల కోసం రోడ్లు వేయడం చూశానని, కానీ రోడ్ల కోసం ఊర్లను తొలగించడం చూడలేదంటూ ఆ రైతన్న సెజ్‌ విషయంలో కన్నీరు పెట్టాడని పవన్‌ గుర్తు చేసుకున్నారు. రైతులు దేవుడికి ప్రతిరూపమనీ, అలాంటి వారిని గౌరవించాల్సిన బాధ్యత అందరిపై ఉందని వ్యాఖ్యానించారు. రైతులపై కాల్పులు, మద్దతు ధర లేకపోవడంతో ఆత్మహత్యలతో రైతుల పరిస్థితి దారుణంగా తయారయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

అనంతపురం నుంచి ఉద్ధానం వరకూ ఎక్కడకు పోయినా రైతుల నుంచి తనకు ఒకే ప్రశ్న ఎదురవుతోందని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. ‘ఏదైనా సమస్యను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌, అధికారుల దగ్గరకు పోతే ప్రభుత్వానికి చెప్పుకో’ అని రైతులకు అధికారులు సూచిస్తున్నారని పవన్‌ వ్యాఖ్యానించారు. అదే రైతులు ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు వెళితే ‘ఈ విషయాన్ని కలెక్టర్‌ కు చెప్పండి.. నా దగ్గరకు రావాల్సిన అవసరం ఏముంది? అని చెబుతున్నారన్నారు. దీంతో సమస్య పరిష్కారానికి ఎవరి దగ్గరకు పోవాలో తెలియక రైతులు అల్లాడిపోతున్నారని పవన్‌ అన్నారు. మా సమస్యలను పరిష్కరించి న్యాయం ఎవరు చేస్తారో తెలియడం లేదయ్యా అంటూ రైతులు విలపిస్తున్నారని చెప్పారు. రైతన్నల సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం తిప్పించుకుంటోందని దుయ్యబట్టారు. అన్నం పండించే రైతుకు అండగా ఉండని ప్రభుత్వం ఎందుకని ప్రశ్నించారు. ఎంతసేపు సింగపూర్‌ తరహా రాజధాని, సింగపూర్‌ తరహా

ప్రభుత్వం అని చంద్రబాబు అంటున్నారనీ, కానీ రైతులకు ఏ రకంగా గిట్టుబాటు ధర కల్పించాలి అని మాత్రం ఆలోచించడం లేదని దుయ్యబట్టారు. కోనసీమలో పంటలు పండక, గిట్టుబాటు ధరలు లేక రైతులు అల్లాడిపోతున్నారని పవన్‌ కల్యాణ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. కానీ బయటి వ్యక్తులు మాత్రం వాస్తవాలు తెలియక..’విూకేమండి!.. అద్భుతమైన కోనసీమ ఉంది. పంటలు బాగా పండుతాయి అని చెబుతూ ఉంటారని వ్యాఖ్యానించారు. కోనసీమ ప్రాంతంలో కాలువలు పూడికతో నిండిపోయినా పట్టించుకునే నాథుడు లేడని పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు. రైతులకు మద్దతు ధర, మార్కెట్‌ కల్పనపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించడం లేదన్నారు. పచ్చటి కోనసీమకు అందరి దిష్టి తగిలిందని జనసేనాని వ్యాఖ్యానించారు. అసలు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం రావడానికి, తెలంగాణ ఓ రాష్ట్రంగా విడిపోవడానికి కోనసీమ పచ్చదనమే కారణమని అభిప్రాయపడ్డారు. కానీ వాస్తవంలో పొలాల్లో మంచినీళ్లు వేసే పైపులు కూడా పగిలిపోయి, నేల నుంచి ఉప్పునీటి ఊట వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కోనసీమ నీళ్లు అంటే కొబ్బరి నీళ్లలా ఉంటాయన్న నానుడి ఉందనీ, ఇప్పుడు మాత్రం ఉప్పునీళ్లు వస్తున్నాయని పవన్‌ అన్నారు.