రైతు ఆత్మహత్యలపై స్పందన కరవు

చిత్తూరు,నవంబర్‌22(జ‌నంసాక్షి): ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు ప్రత్యేక ఆర్థికసాయం, పునరావాసం కల్పించడం కోసం ఉద్ధేశించిన జీవో నెం.62 జిల్లాలో అమలు జరగడం లేదని లెప్ట్‌ నేతలు అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాతినిధ్యం వహిస్తున్న జిల్లాలోనే ఇలాంటి పరిస్థితులు నెలకొనడం శోచనీయమన్నారు. రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్‌ స్పందించి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండు చేశారు. జిల్లాలోని చిత్తూరు, మదనపల్లె డివిజన్‌లలోని ఆరు మండలాల్లో పర్యటించింది. ఏడు గ్రామాల్లో ఆత్మహత్మ చేసుకున్న ఎనిమిది రైతు కుటుంబాల ప్రస్తుత స్థితిగతులను పరిశీలించింది. ఎనిమిది కుటుంబాలను తాము పరిశీలించినప్పుడు ఎవరికీ జీవో నెం.62 ప్రకారం ప్రభుత్వం తరఫున అందాల్సిన

ఆర్థికసాయం అందలేదని తేలిందన్నారు. బాధిత కుటుంబాల సంక్షేమానికి రూ.5లక్షల ఆర్థిక సాయం, ఇల్లు లేని వారికి గృహసదుపాయం, పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడం, మృతుల భార్యలకు పెన్షన్‌ మంజూరు చేయాలన్నారు. అసలు వారు పరిహారానికి అర్హులా.. కాదా.. అని తేల్చేందుకు డివిజన్‌, మండల స్థాయిల్లో ఏర్పాటైన త్రిసభ్య కమిటీలు ఇంతవరకు వారి దగ్గరకి వెళ్లకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వ సాయం కోసం బాధిత కుటుంబాలు రెండేళ్లుగా తహసీల్దార్‌ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునే నాథుడే కరవయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.