రైతు సంక్షేమమే కెసిఆర్ లక్ష్యం : కొత్త
మెదక్,ఆగస్ట్10(జనం సాక్షి): రైతు సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని మెదక్ ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని పథకాలు అమలు చేస్తుందన్నారు. దళితబంధును కేవలం ఉప ఎన్నిక కోసమే అంటున్న వారు ..వారి రాష్టాల్ల్రోనూ ఇలా అమలు చేయాలన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తుందన్నారు. గొల్ల కుర్మల అభివృద్ధికి సీఎం కేసీఆర్ గొర్రె లు పంపిణీ చేశారన్నారు. అన్ని వర్గల సంక్షేమం కోసం టీఆర్‌ఎస్ ప్రభుత్వం కృషి చేసిందన్నారు. ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగు నీరు సరఫరా చేసేందుకు సీఎం కేసీఆర్ సిద్దంగా ఉన్నారని వివరించారు. తాను కష్టపడి ఐదేళ్లలో అనేక కార్యక్రమాలు చేశానని అన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్దిని అడుకుంటున్న కాంగ్రెస్ పార్టీ ప్రజలను ఎలా మోసం చేసిందీ
ప్రజలకు తెలుసని, అందుకే వారిని అన్ని ఎన్నికల్లోనూ ప్రజలు తిరస్కరించారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తండాలను గ్రామ పంచాయతీలుగా చేస్తామని ప్రకటించి ఎందుకు చేయలేదన్నారు. ఎన్నికల్లో సీఎం కేసీఆర్ హావిూ ఇవ్వకుండానే గిరిజన తండాలను గ్రామా పంచాయతీలుగా ఏర్పాటు చేశారన్నారు. సీఎం కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హావిూలను అమలు చేసి బంగారు తెలంగాణ సాధన కోసం కృషి చేశారన్నారు. గోదావరి నీటిని కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మల్లన్న సాగర్‌లో నింపి అక్కడి నుంచి సింగూర్ ప్రాజెక్టులో తరలించి జహీరాబాద్, అందోల్, నారాయణఖేడ్ రైతులకు సాగునీరు అందిస్తామన్నారు. దళితబంధుల అమలు చేస్తామంటే విమర్శలు చేయడం మానాలన్నారు. కెసిఆర్ ఏదైన ప్రకటిస్తే అమలు చేసి చూపుతారని అన్నారు.