రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలి
–
మహబూబాబాద్ కలెక్టర్ శశంక
మహాబూబాబాద్ బ్యూరో-సెప్టెంబర్2(జనంసాక్షి)
మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలతో పాటు అవసరమైన కనీస వసతులను కల్పించాలని జిల్లా కలెక్టర్ కె.శశాంక అధికారులను ఆదేశించారు. శుక్రవారం ప్రధాన ఆసుపత్రిని సందర్శించి ఆసుపత్రి అభివృద్ధి పనుల పురోగతిని కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ డిఎంఎఫ్టి నిధులు 25 లక్షలతో చేపట్టిన పనులకు సంబంధించి ఇంకనూ పెండింగ్ లో ఉన్నవాటిని త్వరగా పూర్తి చేయాలని టీఎస్ఎంఎస్ఐడీసీ ఇంజనీరింగ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. టాయిలెట్స్, స్టెయిర్ కేస్ పారిశుద్ధ్య పెండింగ్ పనులను పూర్తి స్థాయిలో చేపట్టి త్వరగా వినియోగంలోకి తేవాలని కలెక్టర్ ఆదేశించారు. ఇట్టి పనులను ఆసుపత్రి వైద్యాధికారులు పరిశీలించాలని కలెక్టర్ అన్నారు. అదేవిధంగా ఆసుపత్రి అభివృద్ధి పనుల్లో భాగంగా ఇంకనూ అవసరమైన అటెండెంట్ షెడ్, అంతర్గత రోడ్లు, త్రాగునీటి సౌకర్యం తదితర పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రధానంగా జిల్లా ఆసుపత్రికి వచ్చే రోగులకు వారితో పాటు వచ్చేవారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కనీస వసతులైన త్రాగునీటి సౌకర్యం, టాయిలెట్స్, తదితర ఏర్పాట్లు ఉండాలని కలెక్టర్ సూచించారు. టీఎస్ఎంఎస్ఐడిసి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉమామహేశ్వర్, డిఇఇ విద్యాసాగర్,ఏఈ నరేష్, ఆసుపత్రి సూపరింటెండెంట్ లు శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు, డిప్యూటీ సూపరిండెంట్ వెంకట్ లకావత్ తదితరులు పాల్గొన్నారు.