రోడ్డుప్రమాద ఘటన వెనక హత్యాకుట్ర

కేసును ఛేదించిన వినుకొండ పోలీసులు

హత్యకు పాల్పడ్డ వారి అరెస్ట్‌తో వ్యవహారం బట్టబయలు

గుంటూరు,ఆగస్ట్‌14(జ‌నం సాక్షి): గుంటూరు జిల్లా వినుకొండ సవిూపంలోని పసుపులేరు వంతెనపై బైక్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురు లారీ కింద పడిన కేసును పోలీసులు చేధించారు. అది ప్రమాదం కాదని.. పాతకక్షలతో ఉద్దేశపూర్వకంగా జరిగిన హత్యగా పోలీసులు తేల్చారు. ఓ పథకం ప్రకారం వారిని మట్టుబెట్టే ప్రయత్నంలో ప్రమాదంగా చిత్రీకరించారు. ఉపాధి పథకం క్షేత్ర సహాయకుడిగా ఉన్న అందుగులపాడుకు చెందిన సోమయ్య(35)కు గ్రామానికి చెందిన రామకోటయ్యతో ఓ రహదారి విషయంలో గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో ఈనెల 9న రామకోటయ్యపై సీఐకి ఫిర్యాదు చేయాలని పలువురితో ద్విచక్రవాహనాలపై వినుకొండకు బయలుదేరాడు. అదే గ్రామానికిచెందిన మూడబోయిన మల్లికార్జునరావు(28), చల్లా రామకృష్ణ (24)తో కలిసి సోమయ్య ఒక ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్నారు. వీరు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళుతున్నారని తెలుసుకున్న రామకోటయ్య, మరో ఐదుగురితో కలిసి కారులో వెంబడించాడు. చీకటీగలపాలెం ఏపీ ఆదర్శ పాఠశాల వద్ద కారుతో ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టేందుకు ప్రయత్నించాడు. అక్కడ తప్పించుకుని ముందుకు వెళ్లగా పసుపులేరు వంతెనపైకి చేరే సమయంలో ద్విచక్రవాహనాన్ని నెమ్మదిగా పోనిచ్చే సమయంలో కారులో ఉన్నవారిని ఎందుకు ఢీకొట్టాలని చూస్తున్నారని సోమయ్య ప్రశ్నించాడు. కారు నడుపుతున్న చిన సాంబయ్య సమాధానం చెప్పకుండానే.. కారుతో వాహనాన్ని ఢీకొట్టాడు. దీంతో ద్విచక్రవాహనం కుడి పక్కకు వెళ్లింది. అదే సమయంలో కాకినాడ నుంచి కర్నూలు వైపు వెళుతున్న లారీ ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. ద్విచక్ర వాహనం లారీ కిందికి దూసుకెళ్లడంతో సోమయ్య సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. మల్లికార్జునరావు, రామకృష్ణ ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయారు. గ్రామంలో రోడ్డు వేసే విషయంలో వివాదం నేపథ్యంలో ప్రత్యర్థులు వెంబడించి కారుతో ఢీకొట్టి సోమయ్య, రామకృష్ణ, మల్లికార్జునరావును చంపారని వారి బంధువులు ఆరోపించారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. చనిపోయిన వారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని.. వైకాపాకు చెందిన నిందితులు ఉద్దేశపూర్వకంగానే వారిని హతమార్చారని ఆరోపణలు వచ్చాయి. అయితే ఇది ముమ్మాటికీ ప్రమాదమేనని.. తమ పార్టీని ఇరికించేందుకే తెదేపా నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని వైకాపా నేతలు చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ కేసును సవాల్‌గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అన్ని వివరాలు సేకరించి ఆ ముగ్గురిదీ హత్యేనని తేల్చారు. పాత కక్షలతో రామకోటయ్య వారిని కొందరితో కలిసి హతమార్చాడని నిర్దారించారు. దీంతో ప్రధాన నిందితుడు రామకోటయ్య సహా ఐదుగురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

 

తాజావార్తలు