రోహిత్ కు కార్ల్ సాగన్ సతీమణి లేఖ

gmsx2anm

హైదరాబాద్: ‘కార్ల్ సాగన్ మాదిరిగా గొప్ప సైన్స్ రచయిత కావాలనుకున్నా. చివరికిలా ఆత్మహత్య లేఖ రాయాల్సి వచ్చింది. ఇలాంటి లేఖ రాయడం నాకిదే తొలిసారి. బహుశా నా చర్య తప్పే కావచ్చు..’ అంటూ సూసైడ్ నోట్ లో తనకెంతో ఇష్టమైన రచయిత పేరును ప్రస్తావించాడు హెచ్ సీయూ విద్యార్థి వేముల రోహిత్. దీనిపై సాగన్ సతీమణి ఆన్ డ్రుయాన్ స్పందించారు. ప్రస్తుతం అమెరికాలో నివసిస్తోన్న ఆమె.. రాజీవ్ రామచంద్ర అనే సామాజిక కార్యకర్త ద్వారా రోహిత్ మృతి, అనంతర పరిణామాలను తెలుసుకుని ఆ దివంగత విద్యార్థికి ఒక లేఖ రాశారు. ‘నీ మరణం నన్నెంతో బాధించింది’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

‘స్పష్టంగా చీలిపోయిన మానవ సమాజపు ఆనవాళ్లు రోహిత్ మరణ వాగ్మూలంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎన్నిరకాలుగా ఆలోచించినా తనపై కొనసాగిన వివక్షాపూరిత ధోరణే అతని చావుకు కారణమని నేను బలంగా నమ్ముతున్నా’ అని ఆన్ డ్రుయాన్ లేఖలో పేర్కొన్నారు. రోహిత్ చనిపోయిన తర్వాత స్పందించిన సమాజం.. భవిష్యత్ లో అలాంటి చావులకు చోటుండబోదనే సందేశాన్ని ప్రకటిస్తుందని ఆశిస్తున్నానన్నారు. పాపులర్‌ సైన్స్‌కు దిశానిర్దేశం చేసిన కార్ల్‌ సాగన్‌ సతీమణిగానేకాక, ఆయన రాసిన పుస్తకాలకు సహరచయితగానూ ఆన్ డ్రుయాన్ ఖ్యాతిగడించారు.