రష్యా దాడి వల్ల ఆయిల్ ధరలు
న్యూఢిల్లీ: ఉక్రెయిన్ సంక్షోభం ఇంధనంపై ప్రభావం చూపుతోంది. రష్యా దాడి వల్ల ఆయిల్ ధరలు ఆకాశాన్నంటాయి. అత్యవసర చర్యలు తీసుకున్నా.. ప్రస్తుతం ఇంధనం బ్యారెల్ ధర 100 డాలర్లకు చేరింది. ఉక్రెయిన్ వార్ ప్రభావం పడకుండా ఉంచేందుకు చర్యలు తీసుకున్నా.. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మాత్రం నింగికెగురుతున్నాయి. ఆయిల్ ధరలను సూచించే బ్రెంట్ క్రూడ్‌లో.. బ్యారెల్ ధర 110 డాలర్ల మార్క్‌ను చేరింది. గడిచిన ఏడేళ్లలో ఇదే అత్యధిక ట్రేడింగ్ ధర కావడం విశేషం. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ సభ్య దేశాలు అత్యవసరం 60 మిలియన్ల బ్యారెళ్ల ఇంధనాన్ని రిలీజ్ చేయడానికి అంగీకరించిన తర్వాత కూడా ముడి చమురు ధరలు పెరగడం శోచనీయం. బ్యారెల్ ఇంధనం ధర పెరగడంతో.. పెట్టుబడిదారులు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ సంక్షోభం నేపథ్యంలో అనేక దేశాలు రష్యాపై ఆంక్షలు విధిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఖనిజాలు, దినుసుల ధరలు పెరుడుతున్నాయి. గత నెలలోనే గోధుమ ధర 30 శాతం పెరిగినట్లు అంచనా వేస్తున్నారు. ఇంధనం ఉత్పత్తి చేస్తున్న పెద్ద దేశాల్లో రష్యా ఒకటి. ఉక్రెయిన్‌పై వార్‌తో ఇంధనం లేదా గ్యాస్ సరఫరాపై ప్రభావం పడే అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్నారు.