లక్వార్‌ డ్యామ్‌ కోసం..

ఆరు రాష్ట్రాలతో ఒప్పందం
– యమునా నదిపై డ్యామ్‌ నిర్మాణం
న్యూఢిల్లీ, ఆగస్టు28(జ‌నం సాక్షి) : లక్వార్‌ డ్యామ్‌ నిర్మాణం కోసం ఉత్తరాదిలోని ఆరు రాష్ట్రాలు మళ్లీ ఏకం అయ్యాయి. కేంద్ర జలవనరుల మంత్రి నితిన్‌ గడ్కరీ నేతృత్వంలో యూపీ, ఢిల్లీ, ఉత్తరాకండ్‌, రాజస్థాన్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, హర్యానా రాష్ట్రాల సీఎంలు మంగళవారం లక్వార్‌ డ్యామ్‌కు సంబంధించిన ఒప్పందంపై సంతకాలు చేశారు. 1976లో డ్యామ్‌ నిర్మాణం కోసం అనుమతి లభించింది. కానీ 1992 నుంచి డ్యామ్‌ పనులు నిలిచిపోయాయని మంత్రి తెలిపారు. ఆరు రాష్ట్రాలకు ఉపయోగపడే లక్వార్‌ డ్యామ్‌ నిర్మాణం కోసం సుమారు నాలుగు వేల కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ డ్యామ్‌ను యమునా నదిపై నిర్మించనున్నారు. బహుళ ప్రయోజనాలు కలిగిన ఈ డ్యామ్‌ను ఉత్తరాఖండ్‌లోని యమునా బేసిన్‌లో నిర్మిస్తారు. ఒప్పంద కార్యక్రమంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, రాజస్థాన్‌ సీఎం వసుందరా రాజే, ఉత్తరాఖండ్‌ సీఎం తివేంద్ర రావత్‌, హర్యానా సీఎం మనోహర్‌ లాల్‌ ఖట్టార్‌, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజీవ్రాల్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ సీఎం జైరామ్‌ థాకూర్‌లు పాల్గొన్నారు. డెహ్రాడూన్‌ జిల్లాలోని లొహారీ గ్రామం వల్ల యమునా నదిపై .. సుమారు 204 విూటర్ల ఎత్తులో కాంక్రీట్‌తో లక్వార్‌ డ్యామ్‌ను నిర్మించనున్నారు. ఈ డ్యామ్‌లో ఉన్న నీటితో సుమారు 40 వేల హెకార్ల పంటలకు నీరందిస్తారు. పరిశ్రమలకు, తాగునీరుగా కూడా డ్యామ్‌ నీటిని వాడనున్నారు. ఉత్తరాఖండ్‌ జల విద్యుత్‌ నిఘమ్‌ లిమిటెడ్‌ ఈ డ్యామ్‌ నుంచి 300 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది.