లవ్ జిహాద్ కేసుల్లో దోషులకు పదేండ్ల జైలు
రైతులందరికీ ఉచిత విద్యుత్ అందిస్తాం
చక్కెర మిల్లుల పునరుద్ధరణకు 5వేల కోట్లు కేటాయింపు
బిజెపి మ్యానిఫెస్టో విడుదల చేసిన అమిత్ షా
రైతులను రుణవిముక్తి చేస్తామన్న ఎప్సీ మేనిఫెస్టో
సత్యవచన్ పేరుతో విడుదల చేసిన అఖిలేష్
లక్నో,ఫిబ్రవరి8( జనంసాక్షి): యూపి ఎన్నికల నేపథ్యంలో బిజెపి,ఎస్పీలు తమ మేనిఫెస్టోలు విడుదల చేశాయి. లవ్ జిహాద్ కేసుల్లో దోషులకు పదేండ్ల జైలు శిక్షతో పాటు రూ. లక్ష జరిమానా విధిస్తామని మ్యానిఫెస్టోలో బిజెపి స్పష్టం చేసింది. రైతులందరికీ ఉచిత విద్యుత్ అందిస్తామని, వరి, గోధుమకు మద్దతు ధర కల్పిస్తామని భరోసా ఇచ్చింది. యూపీలో చక్కెర మిల్లుల పునరుద్ధరణకు రూ 5000 కోట్లు కేటాయిస్తా మని హావిూ ఇచ్చింది. యూపీ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ మంగళవారం మ్యానిఫెస్టోను విడుదల చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా లక్నోలో ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేశారు. వచ్చే ఐదేళ్లలో రైతులందరికీ వ్యవసాయం కోసం ఉచిత విద్యుత్ అందిస్తామని అమిత్ షా ప్రకటించారు. కళాశాలల్లో చదివే విద్యార్థినులకు ఉచితంగా ద్విచక్రవాహనాలను అందిస్తామని అమిత్ షా విడుదల చేసిన ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నారు. 60 ఏళ్లు పైబడిన మహిళలకు బస్సుల్లో ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. దీపావళి, హోలి పండుగల సందర్భంగా ఉచితంగా ఎల్పీజీ సిలిండర్లను ఇస్తామని బీజేపీ హావిూలిచ్చింది. యూపీలో 6 మెగా ఫుడ్ పార్కులు ఏర్పాటు చేస్తామని అమిత్ షా వివరించారు. బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసిన కార్యక్రమంలో యూపీ సీఎం అభ్యర్థి యోగి ఆదిత్యనాథ్ కూడా ఉన్నారు. మరోవైపు యూపీ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్‌కు సర్వం సిద్ధమవడంతో రాజకీయ పార్టీలు ప్రచార పర్వాన్ని హోరెత్తించాయి. మరోవైపు సమాజ్‌వాదీ పార్టీ మేనిఫెస్టోను ఆ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్
విడుదల చేశారు. లక్నోలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విూడియా సమావేశంలో కొంత మంది సీనియర్ నేతలతో కలిసి 88 పేజీల మేనిఫెస్టో విడుదల చేసిన అఖిలేష్.. 2025 నాటికి రైతుల రుణాలన్నింటినీ మాఫీ చేస్తామని ప్రధానంగా చెప్పుకొచ్చారు. 2012కు ముందు నేను పార్టీ మేనిఫెస్టో విడుదల చేశాను. ఆ తర్వాత సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వం ఏర్పడిరది. అంతకు ముందు ఎన్నికల్లో ఇచ్చిన హావిూలన్నిటిపై కమిటీలు వేసి రిపోర్ట్‌లు తీసుకుని అన్ని హావిూలు నెరవేర్చాం. ఇప్పుడు కూడా మేనిఫెస్టోలో కొన్ని హావిూలు పేర్కొన్నాం. మా మేనిఫెస్టో పేరు ’సత్య వచన్, అటూట్ వాదా’. ఇదే నినాదంతో మేం ప్రజల ముందుకు వెళ్తున్నాం. మేం అధికారంలోకి రాగానే ఈ మేనిఫెస్టోను కూడా పూర్తిగా అమలు చేస్తాం‘ అని అఖిలేష్ అన్నారు. ’సమాజ్‌వాదీ వచన్ పత్ర’ పేరుతో ’సత్య వచన్, అటూట్ వాదా’ అనే ట్యాగ్‌లైన్‌తో దీనిని రూపొందించారు. 2012లో తాము చేసిన వాగ్దానాలను నెరవేర్చామని చెప్పారు. 2025నాటికి రైతులందరినీ రుణ విముక్తుల్ని చేస్తామని ఈ మేనిఫెస్టోలో వాగ్దానం చేస్తున్నామన్నారు. పేద రైతుల లబ్ది కోసం రుణ ముక్తి చట్టాన్ని తీసుకొస్తామన్నారు. అన్ని పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)ని ఇస్తామన్నారు. చెరకు రైతులు తాము అమ్మిన పంటకు 15 రోజుల్లో చెల్లింపులు పొందేవిధంగా చర్యలు తీసుకుంటామన్నారు. రైతులందరికీ వ్యవసాయానికి ఉచిత విద్యుత్తును అందజేస్తామన్నారు. వడ్డీ లేని రుణాలను, బీమా సదుపాయాన్ని కల్పిస్తామన్నారు. పింఛను పథకాన్ని ప్రవేశపెడతామని చెప్పారు. గ్రావిూణ ఉపాధి హావిూ పథకం మాదిరిగా పట్టణ ఉపాధి హావిూ పథకం కోసం ఓ చట్టాన్ని తీసుకొస్తామన్నారు. ప్రభుత్వోద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. పోలీసు ఉద్యోగాల్లో కూడా మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారు. బాలికలకు ప్రాథమిక తరగతుల నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ఉచిత విద్యను అందజేస్తామన్నారు. 12వ తరగతి ఉత్తీర్ణులైన బాలికలకు రూ.36,000 చెల్లిస్తామని తెలిపారు. సమాజ్‌వాదీ పింఛనును తిరిగి ప్రారంభిస్తామని, వృద్ధులు, అవసరార్థులైన మహిళలు, దారిద్య రేఖకు దిగువన ఉండే కుటుంబాలకు సంవత్సరానికి రూ.18,000 చెల్లిస్తామన్నారు. దీని వల్ల దాదాపు 1 కోటి మందికి లబ్ది చేకూరుతుందన్నారు. పేద కార్మికులు, కూలీలు వంటివారికి రాయితీ ధరలపై రేషన్ సరుకులు లభించే విధంగా కిరాణా దుకాణాలను, సమాజ్‌వాదీ కేంటీన్లను ఏర్పాటు చేస్తామన్నారు. వలస కూలీల కోసం మజ్దూర్ పవర్ లైన్‌ను ఏర్పాటు చేస్తామని, హెల్ప్‌లైన్ నంబరు 1890 అని చెప్పారు. ఇదిలావుంటే సమాజ్‌వాదీ పార్టీకి మద్దతుగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రచారం చేపట్టారు. బీజేపీ కల్లబొల్లి మాటలు నమ్మవద్దని ఎస్పీకే ఓటు వేసి అభివృద్ధికి పట్టం కట్టాలని ఆమె మంగళవారం లక్నోలో ఓటర్లకు పిలుపు ఇచ్చారు. కాషాయ పార్టీ కపట వాగ్దానాలను నమ్మవద్దని, ఎస్పీకి ఓటు వేసి అధికారం అప్పగించాలని, బీజేపీని మట్టికరిపించాలని ఆమె కోరారు. ఇక అంతకుముందు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) గెలుపొందాలని కోరుకుంటున్నట్లు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆకాంక్షించారు. కోల్‌కతాలో ఆమె విూడియాతో మాట్లాడుతూ ఉత్తర్ ప్రదేశ్ ప్రజలు ఆదరిస్తే ఈ ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ విజయం సాధించే అవకాశం మెండుగా ఉందన్నారు.
ఇక ఫిబ్రవరి 10 నుంచి మార్చి ఏడు వరకూ ఏడు దశల్లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు. ఈ ఎన్నికల్లో మరోసారి గెలుపొంది పాలనా పగ్గాలు చేపట్టాలని బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతుండగా, యోగి ప్రభుత్వంపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకతను సొమ్ము చేసుకుని అందలం ఎక్కాలని అఖిలేష్ యాదవ్ సారధ్యంలోని ఎస్పీ చెమటోడుస్తోంది. ఇక ప్రియాంక గాంధీ ఇమేజ్‌తో సత్తా చాటాలని కాంగ్రెస్ పావులు కదుపుతుండగా , దళితులు..అణగారిన వర్గాల
వెన్నుదన్నుతో సత్తా చాటాలని మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ కసరత్తు సాగిస్తోంది.