లాల్‌దర్వాజ బోనాలకు సర్వం సిద్ధం

హైదరాబాద్‌, జూలై 14 (జనంసాక్షి) : పాతబస్తీలో లాల్‌దర్వాజ బోనాలు సందర్భంగా భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు నిర్వాహకులు తెలిపారు. మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. అంతేగాక 11 ఆలయాలు కూడా ముస్తాబయ్యాయన్నారు. జాతర, ఊరేగింపు జరగనున్న నేపథ్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. పాతబస్తీలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ఈ ఆంక్షలు ఆదివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు. ఆదివారం తెల్లవారుజాము నుంచి ప్రారంభమయ్యే బోనాల ఉత్సవం సోమవారం సాయంత్రంతో ముగియనున్న విషయం తెలిసిందే. అంతేగాక 15,16 తేదీల్లో మద్యం దుకాణాలను మూసివేయాలని పోలీసులు ఆదేశించారు.

ఆంక్షలు ఇవే..
-కందికల్‌గేట్‌ నుంచి లాల్‌దర్వాజా వైపు అనుమతించడం లేదు. -ఛత్రినాక స్టేషనర్‌ టీజంక్షన్‌ నుంచి గౌలిపూరా వైపు దారి మళ్లిస్తున్నారు. -పూల్‌బాడ్‌ నుంచి లాల్‌దర్వాజా వైపు అనుమతించరు. – పత్తర్‌ కీదర్గా మీదుగా ఛత్రినాక పాత ఏసీపీ కార్యాలయం వైపు మళ్లిస్తున్నారు. – బాలాగంజ్‌ నుంచి లాల్‌ దర్వాజ వైపు ట్రాఫిక్‌ను అనుమతించడం లేదు. -గౌలీపురా మీదుగా మళ్లిస్తున్నారు. – గౌలిపూరా మార్కెట్‌ నుంచి సుధా టాకీస్‌ వైపు వెళ్లే వాహనాలను లైబ్రరీ మీదుగా అశోక్‌ పిల్లర్‌ చౌరస్తా వైపు మళ్లిస్తున్నారు. – ఉప్పుగూడ నుంచి ఛత్రినాక వైపు వచ్చే వాహనాలను మొగల్‌పూరా నుంచి గౌలిపూర మీదుగా మళ్లిస్తున్నారు. చంద్రాయణ గుట్ట నుంచి అలియాబాద్‌కు వెళ్లే ట్రాఫిక్‌ను శంషీర్‌గంజ్‌ జంక్షన్‌ నుంచి తాడ్బన్‌ మీదుగా అల్మాస్‌ హోటల్‌ వైపు మళ్లిస్తారు. – భవానీనగర్‌, మీర్జుమ్లా తబాబ్‌ నుంచి వచ్చే ట్రాఫిక్‌ బీబీబజార్‌ చౌరస్తా నుంచి అలిజా కోట్ల మీదుగా చౌక్‌ మైదాన్‌ఖాన్‌ వైపు దారి మళ్లిస్తారు. – యాకుత్‌పూరా నుంచి గుల్జార్‌హౌస్‌ వైపు వెళ్లే వాహనాలను మీర్‌చౌక్‌ మీదుగా ఈతేబజార్‌ మసీదు వైపు దారి మళ్లిస్తారు. – పురాణాపూర్‌, మండి రోడ్‌ నుంచి చెత్తా బజార్‌ వైపు వచ్చే వాహనాలను లక్కడ్‌కోటే చౌరస్తా నుంచి దార్‌ఉల్‌షిఫా వైపు మళ్లిస్తారు. – ఫతేదర్వాజా నుంచి హిమ్మత్‌పూరా వైపు ట్రాఫిక్‌ను అనుమతించరు. -పురానాపూల్‌ నుంచి లాడ్‌ బజార్‌కు వచ్చే వాహనాలను మోతిగల్లి మీదుగా దారి మళ్లిస్తున్నారు. – కిల్వత్‌ నుంచి లాడ్‌ బజార్‌కు వచ్చే ట్రాఫిక్‌ను మోతిగల్లి టీ జంక్షన్‌ వద్ద దారి మళ్లిస్తున్నారు. -షక్కర్‌కోటే నుంచి మట్టీకా షర్‌, ఝాన్సీ వైపు వచ్చే వాహనాలను మట్టీకాషర్‌ వద్ద దారి మళ్లిస్తున్నారని అధికారులు వివరించారు. ఇదిలా ఉండగా భారీ భద్రత నేపథ్యంలో సర్దార్‌మహల్‌లో అన్ని విభాగాలతో కలిపి జాయింట్‌ కంట్రోల్‌ రూము ఏర్పాటు చేశారు. పాతబస్తీలో ఇప్పటికే సిసి కెమెరాలను ఏర్పాటు చేశారు.