లేఖకు కట్టుబడి ఉన్నాం: టీడీపీ
ఆదిలాబాద్, అక్టోబర్ 25 : తెలంగాణ రాష్ట్ర విషయమై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పష్టమైన ప్రకటన చేసినప్పటికీ టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని ఆదిలాబాద్ ఎంపీ రమేష్ రాథోడ్ ఆరోపించారు. 2008లో పార్టీ కేంద్రానికి ఇచ్చిన లేఖకు కట్టుబడి ఉన్నామని ప్రతిసారి చంద్రబాబు స్పష్టం చేసినప్పటికీ నాయకులు అనవసరగందరగోళాన్ని సృష్టిస్తున్నారని ఆయన విమర్శించారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకులు ఎన్ని ప్రకటనలు చేసినప్పటికీ తెలంగాణ ప్రజలు నమ్మె స్థితిలో లేరని ఆయన పేర్కొన్నారు. ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి చంద్రబాబు యాత్ర చేపట్టారని ఆయన వివరించారు. అవినీతిలో కూరుకుపోయిన వైఎస్సార్ కుటుంబ సభ్యులు తమ అవినీతి డబ్బును రక్షించుకోవడానికి పాదయాత్ర చేపట్టారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రజల సమస్యలను పరిష్కరించడంతో పూర్తిగా విఫలమైందని అన్నారు. రైతులు కరెంట్ కోతలతో, పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక సతమతమవుతున్న ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. పత్తి క్వింటాల్‌కు 6 వేల ధర చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లాలో చంద్రబాబునాయుడు చేపట్టే యాత్రను విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.