లోక్‌సభలో తగ్గిన ఇద్దరు సభ్యులు

– జోస్‌కె మణి, బైజయంత్‌ జైపాండే రాజీనామాలను ఆమోదించిన స్పీకర్‌
న్యూఢిల్లీ, జులై19(జ‌నం సాక్షి) : శుక్రవారం తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో లోక్‌సభలో మరో ఇద్దరు సభ్యులు తగ్గారు. బిజు జనతాదళ్‌ ఎంపీ బైజయంత్‌ జై పాండే పదవికి రాజీనామా చేయగా, స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ఆయన రాజీనామాను అంగీకరించారు. అలాగే కేరళ కాంగ్రెస్‌(ఎం)కు చెందిన జోస్‌ కే మణి రాజ్యసభకు నామినేట్‌ కావడంతో లోక్‌సభలో ఎంపీ పదవికి రాజీనామా చేశారు. సభలో మరో రెండు స్థానాలు ఖాళీ అయ్యాయని గురువారం పార్లమెంటు వర్గాలు వెల్లడించాయి. అయితే బిజు జనతాదళ్‌ ఇప్పటివరకూ తమ వైఖరి వెల్లడించలేదు. అవిశ్వాసానికి మద్దతిస్తారా? లేదా? అనే అంశంపై స్పష్టత లేదు. ఒడిశాలోని కేంద్రపరా నియోజకవర్గం ఎంపీగా ఉన్న జై
పండా జూన్‌ 12న తన పదవికి రాజీనామా చేశారు. అయితే గురువారం స్పీకర్‌ను కలిసి తన రాజీనామాను ఆమోదించాలని కోరగా ఆమె ఆమోదించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని జై పండాను బిజు జనతాదళ్‌ ఈ ఏడాది జనవరిలో పార్టీ నుంచి బహిష్కరించారు. సభలో ఇద్దరు సభ్యులు తగ్గడంతో స్పీకర్‌ మినహా సంఖ్యా బలం 533కు చేరింది. రాజీనామాలు చేసిన ఈ ఇద్దరు సభ్యులతో కలిపి మొత్తం 11 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. దీంతో మెజార్టీ మార్కు సంఖ్య 266గా ఉంది. లోక్‌సభలో భాజపాకు 273 సీట్లు ఉండటంతో ధైర్యంగా ఉంది. అంతేకాకుండా ఎన్డీఏ కూటమిలోని పార్టీల మద్దతు కూడా తమకే ఉందని కేంద్రం చెప్తోంది. శుక్రవారం లోక్‌సభలో ప్రధాని మోదీ ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగనుంది.
———————————