లోన్ యాప్ ఉచ్చులో మరో యువకుడు

 

బయ్యారం,జులై22(జనంసాక్షి):
రోజు రోజుకీ పెరుగుతున్న సాంకేతికతను వినియోగించుకోవడంలో కంపెనీలు ముందుకెలుతున్నాయి.ఈ క్రమంలో అందరికి అందుబాటులో ఉన్న టెక్నాలజీ కొన్ని సందర్భాలలో దుర్వినియోగం కూడా జరుగుతుంది. దీన్ని ఆసరాగా తీసుకొని కొందరు కేటుగాళ్ళు, అమాయకులనే టార్గెట్ గా చేసుకొని లోన్ పేరుతో హింసిస్తున్నారు. సరిగ్గా
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో అలాంటి సైబర్ మోసం వెలుగు చూసింది. అవసరాల నిమిత్తం ఆన్లైన్ యాప్ ద్వారా లోన్ తీసుకుని తిరిగి చెల్లించినప్పటికీ, యాప్ నిర్వాహకులు డబ్బులు చెల్లించాలని వేధిస్తుండడంతో ఓ యువకుడు తీవ్ర మనస్థాపానికి గురై తన మానసిక ఆవేదనను సెల్ఫీ వీడియో ద్వారా వాట్సాప్ గ్రూపులలో పోస్ట్ చేయడంతో గురువారం విషయం వెలుగులోకి వచ్చింది. వీడియో ఆధారంగా యువకుడు తెలిపిన వివరాల ప్రకారం… మెహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం జగ్గు తండ గ్రామపంచాయతీ చెందిన యువకుడు 45 రోజుల క్రితం హ్యాండీలోన్ అనే మొబైల్ యాప్ ద్వారా రూ.3500 లోన్ తీసుకోగా, యాప్ యొక్క మెయింటెనెన్స్ కటింగ్ లో భాగంగా రూ.1225 ముందుగానే కట్ చేసుకుని రూ.2225 బాధితుని బ్యాంకు ఖాతాలో జమ చేయగా, యాప్ షరతుల ప్రకారం వారం రోజుల వ్యవధిలో లోన్ తీసుకున్న మొత్తం డబ్బులు తిరిగి చెల్లించాడు. కాగా యాప్ నిర్వాహకులు డబ్బులు చెల్లించాలని పదేపదే ఫోన్లు చేసి వేధిస్తున్న క్రమంలో మొత్తం చెల్లించానని ఎంత మొరపెట్టుకున్నా ఫలితం లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో చేసేదేమీ లేక వాయిదాల పద్ధతిలో సుమారు 15 వేల రూపాయలు చెల్లించాడు. అయినప్పటికీ బాధితుడికి ఉపశమనం లభించలేదు. బాధితుడి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఇంకా డబ్బు లాగాలనే అత్యాశతో యాప్ నిర్వాహకులు తరచూ ఫోన్ చేసి డబ్బులు చెల్లించాలని లేకపోతే తన న్యూడ్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తామని బెదిరించడం మొదలుపెట్టారు. దీంతో దాదాపు 20 రోజులుగా బాధితుడు మానసిక ఆవేదనకు లోనై బయటకు రాకుండా ఇంట్లోనే ఉంటున్నాడు. లోన్ ఆప్ కు సంబంధించిన ఫోన్ నెంబర్లను బ్లాక్ చేసి, యాప్ ను సైతం డిలీట్ చేశాడు. బాధితుడు ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండడంతో లోన్ తీసుకునే సమయంలో సెకండ్ కాంటాక్ట్ బాధితుడు న్యూడ్ ఫోటోలు వచ్చిన విషయం తెలుసుకొని షాక్ అయ్యాడు.
ఈ విషయం తెలుసుకున్న తర్వాత బాధితుడు సోషల్ మీడియాలో సెల్ఫీ వీడియో లో తన బాధను వ్యక్తం చేశాడు.
వాట్సాప్ గ్రూప్ లలో తన ఫొటోతో వస్తున్న అసభ్య పోస్టులు నమ్మకండని,ఎన్ని డబ్బులు కట్టినా రకరకాలుగా అసభ్యకర ఫోటోలతో వాట్సప్ గ్రూపులలో షేర్ చేస్తూ బెదిరిస్తున్నారని, ఒకవేళ తన ఫోటోతో వచ్చే అసభ్యకర పోస్టులను పెద్ద మనసుతో వెంటనే డిలీట్ చేయాలని, ఎవరూ వాటిని నమ్మకండని, విషయం తెలుసుకున్న వారెవరూ ఫోన్ చేసి ఇబ్బంది పెట్టొద్దని ప్రాధేయపడ్డాడు.