వజ్రోత్సవ వేళ దాతలు ఒక్క లైటైనా పెట్టారా…ప్లీజ్

చండ్రుగొండ జనంసాక్షి (ఆగస్ట్  13)  :  75ఏళ్ల స్వాతంత్య్ర  సంబురాలకు  నా తోటి మిత్రులు (ప్రభుత్వ కార్యాలయాలు ) మువ్వన్నెల వెలుగుల్లో రంగు రంగుల లైట్లతో   కళకళలాడుతున్నారు. నన్ను    కూడా  అలా  విద్యుత్ దీపాలంకరణ చేస్తే బాగుంటుందని  అనిపించింది.   కానీ నాకు దిక్కెవరు నేను  అన్నీ ఉన్నా  అనాథని, మీకు సేవ చేసేందుకు ఎంతో ఆశగా  వచ్చాను కానీ నా బాసు (టీఎస్ ఆర్టీసీ)     నన్ను మోసం చేసి అనాథను  చేశారు. అనేక ఏండ్లుగా  నా ప్రాంగణం చీకట్లో మగ్గుతున్నది.ఇదే అదునుగా భావించిన కొంతమంది నన్ను  అన్ని రకాలుగా వాడేసుకుంటున్నారు. దానివల్ల నా సేవలు అందుకునేందుకు వచ్చిన వారు   నన్ను చూసి చీదరించుకొని వెళుతున్నారు. అయినా నేను ఎప్పుడూ ఏమీ అనలేదు, అడగలేదు ఇప్పుడు ఎందుకో వజ్రోత్సవాలు కదా….  ఒక్క లైట్ అయినా  వెలిగిస్తారని ఆశపడ్డాను అందుకే అడుగుతున్నా….ఇంతకీ నేనెవరో చెప్పలేదు కదా  నేను ఒక ఆర్టీసీ బస్టాండ్ ను  చండ్రుగొండ మండల కేంద్రంలో  జాతీయ రహదారికి ఆనుకుని  జిల్లా కేంద్రానికి  20కిలోమీటర్ల దూరంలో వున్నాను, ఇది స్థానిక  ఆర్టీసీ ప్రాంగణం దయనీయ దుస్థితి, శుక్రవారం మండల కేంద్రంలోని  రెవెన్యూ   పోలీస్, పీహెచ్సీ పంచాయతీ  ప్రధాన కూడలి తో సహా  అన్ని ప్రభుత్వ కార్యాలయాలు  త్రివర్ణ పతాక వెలుగుల్లో దర్శనమిస్తుంటే  ఒక్క ఆర్టీసీ ప్రాంగణం మాత్రం చీకట్లో మగ్గుతున్న  పరిస్థితి కనిపించింది. బస్టాండ్ కె నోరుంటే  ఇలా చెప్పేదేమొ అనిపించింది. ఇప్పటికైనా  సంబంధిత అధికారులు స్పందిస్తారా  కనీసం ఒక్క లైట్ ఏర్పాటు చేస్తారా వేచి చూద్దాం …!