వన్డేలకు సచిన్‌ గుడ్‌బై

– 23 ఏళ్ల అద్భుత ఆటకు తెర  – 16 ఏళ్లకే అరంగేట్రం

– 18,426 పరుగులు చేసిన క్రికెట్‌ దిగ్గజం

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 23 (ఎపిఇఎంఎస్‌):

ప్రపంచంలోనే మేటి బ్యాట్స్‌మన్‌గా పేరొందిన భారత క్రికెటర్‌ సచిన్‌టెండూల్కర్‌ ఇక వన్డేలలో ఆడబోనంటూ ప్రకటించారు. ఈ మేరకు భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డుకు లేఖ ద్వారా ఈ విషయాన్ని తెలిపారు. 23 ఏళ్లపాటు భారత క్రికెట్‌ జట్టుకు విశిష్ట సేవలు అందించిన సచిన్‌ టెండూల్కర్‌ తన 16వ ఏటే జట్టుకు ఎంపికయ్యారు. ప్రపంచంలోనే  వన్డేలలో అత్యధిక పరుగులు చేసిన ఘనత ఆయనదే. వన్డేలలో శతకాలు, అర్ధశతకాలు చేసిన వారిలో అగ్రజుడు కూడా ఇతనే. మొత్తం 463 వన్డేలు ఆడిన సచిన్‌ 18,426 పరుగులు చేశారు. బ్యాటింగ్‌లోనే కాకుండా ఆయన బౌలింగ్‌లో కూడా రాణించారు. జట్టు ఆపద సమయంలో ఉన్నప్పుడు బౌలింగ్‌లో రాణించి జట్టు విజయానికి కృషి చేశారు. వన్డేలలో 154 వికెట్లు కూడా పడగొట్టాడు. వన్డేలో ఆయన వ్యక్తిగత అత్యధిక స్కోర్‌ 200. 1989 డిసెంబర్‌ 18న ఆయన తొలి వన్డేను పాకిస్థాన్‌తో ఆడాడు. ఆయన చివరి మ్యాచ్‌ కూడా పాకిస్థాన్‌తోనే ఆడటం విశేషం. వన్డేలలో అత్యధిక సగటు కూడా ఆయన పేరనే ఉంది. 44.86 పరుగులు ఆయన సగటు స్కోర్‌. ఆయన వన్డే చరిత్రలో 49 సెంచరీలు, 96 అర్ధ సెంచరీలు చేశారు. తాను వన్డే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పినా టెస్టులో మాత్రం కొనసాగుతారని సచిన్‌ భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (బీసీసీఐ)కి రాసిన లేఖలో పేర్కొన్నారు.

ఆదివారం పాకిస్థాన్‌తో జరిగే 20 ట్వంటీ జట్టు ఎంపిక జరగాల్సి ఉండగా అంతకుముందే సచిన్‌ తన రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని బీసీసీఐకి తెలిపారు. ఈ సందర్భంగా సచిన్‌ ఇన్నాళ్లు ఉండేందుకు తనకు సహకరించిన బీసీసీఐకి, సహచర ఆటగాళ్లకు కృతజ్ఞతలు తెలిపారు. వరల్డ్‌కప్‌ భారత జట్టు గెలుచుకునే సమయంలో తాను జట్టులో ఉండటం అదృష్టంగా భావిస్తున్నట్టు ఆయన తన లేఖలో పేర్కొన్నారు. జట్టు మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. క్యాచ్‌లు పట్టడంలో కూడా సచిన్‌ అగ్రగామే. ఫీల్డింగ్‌లో కూడా సచిన్‌ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సాధించగలిగారు. యువ ఆటగాళ్లకు ప్రోత్సాహం ఇవ్వాలన్న సదుద్దేశంతోనే ఆయన వన్డే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పినట్టు సమాచారం. టెస్ట్‌లలో మాత్రం కొనసాగుతానని తెలిపారు. ఏది ఏమైనా భారత క్రికెట్‌జట్టుకు ఇంతటి సేవలు అందించిన ఆటగాడు భవిష్యత్తులో మరొకరు వస్తారని ఆశించడం కష్టమే.