వన్డే మ్యాచ్ లో టీమిండియా 250 పరుగులు

5రాణించిన రోహిత్, పాండే

పెర్త్: ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఇక్కడ శనివారం వెస్ట్రన్ ఆస్ట్రేలియాతో జరుగుతున్న వార్మప్ వన్డే మ్యాచ్ లో టీమిండియా 250 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా ఆదిలోనే ఓపెనర్ శిఖర్ ధవన్(4), విరాట్ కోహ్లి(7) వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది.  ఆ తరుణంలో రోహిత్ శర్మ-అజింక్యా రహానేల జోడీ ఇన్నింగ్స్ మరమ్మత్తులు చేపట్టారు. కాగా, రహానే(41) మూడో వికెట్ రూపంలో పెవిలియన్ కు చేరడంతో టీమిండియా తడబడినట్లు కనిపించింది. అయితే  రోహిత్ శర్మ (67; 82 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు) , మనీష్ పాండే(58; 59 బంతుల్లో 3 ఫోర్లు) ఆకట్టుకోవడంతో టీమిండియా గాడిలో పడింది.  టీమిండియా మిగతా ఆటగాళ్లలో రవీంద్ర జడేజా(26) ఫర్వాలేదనిపించినా, ధోని(15), గుర్కీరత్ సింగ్ (6)లు నిరాశపరిచారు. చివరి వికెట్ గా అశ్విన్(4) పెవిలియన్ చేరడంతో టీమిండియా 49.1ఓవర్లలో 249 పరుగులకు పరిమితమైంది. వెస్ట్రన్ ఆస్ట్రేలియా బౌలర్లలో డ్ర్యూ పోర్టర్ ఐదు వికెట్లతో ఆకట్టుకోగా, మూర్ హెడ్ కు రెండు, మూడీ, కానోర్లకు తలో వికెట్ లభించింది.