వరదబాధిత ప్రాంతాల్లో సిఎం విజయన్‌ పర్యటన

సహాయక చర్యల పర్యవేక్షణ

తిరువనంతపురం,ఆగస్ట్‌11(జ‌నం సాక్షి): కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ వరద బాధిత ప్రాంతాలను సందర్శించారు. సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించారు. నైరుతి రుతుపవనాలు కేరళపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని, గత మూడురోజులుగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయని అధికారులు తెలిపారు. గత 26 ఏళ్లలో తొలిసారిగా ఇడుక్కి జలవిద్యుత్‌ రిజర్వాయర్‌ వ్యవస్థలోని చిరుటోని డ్యాంకు చెందిన మొత్తం ఐదు గేట్లను ఎత్తి నీటిని కిందకి విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇడుక్కి ఆనకట్ట ఆసియాలోనే అతిపెద్ద వంపు కలిగిన ఆనకట్టలలో రెండవది. కాగా, ముఖ్యమంత్రి ఇడుక్కి, అలప్పాజా, ఎర్నాకులం, వయనాడ్‌, కొజికోడ్‌; మలప్పురం ప్రాంతాలను ఏరియల్‌ సర్వే చేస్తున్నారు. ఆయనతో పాటు రెవెన్యూ మంత్రి ఇ. చంద్రశేఖరన్‌, ప్రతిపక్ష పార్టీ నేత రమేష్‌ చెన్నితాల్‌ పాల్గన్నారు. అయితే వాతావరణంఅనుకూలించకపోవడంతో ఇడుక్కిలోని కట్టుప్పన సవిూపంలో నిర్నయించిన హెలిపాడ్‌ ప్రదేశంలో హెలికాప్టర్‌ను ల్యాండ్‌ చేయడం కుదరలేదని అధికారులు తెలిపారు. దీంతో తిరిగి హెలికాప్టర్‌ వయనాడ్‌కు చేరుకుంటుందని పేర్కొన్నారు.

కేరళకు కోటి సాయం ప్రకటించిన పుదుచ్చేరి సిఎం

కేరళలో కురుస్తున్న భారీ వర్షాల ధాటికి 29మంది మృతి చెందగా, పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో పలు జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా, పుదుచ్చేరి ప్రభుత్వం కేరళ వరద బాధితుల సహాయ నిధి కింద కోటి రూపాయలు ప్రకటించింది. పుదుచ్చేరి ముఖ్యమంత్రి వి.నారాయణ స్వామి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో ఫోన్‌లో మాట్లాడి అక్కడి పరిస్థితులను గురించి తెలుసుకుని, అవసరమైన సహాయాన్ని అందిస్తామని హావిూ ఇచ్చారు. తన ఆలోచనలు కేరళలో అనూహ్యవర్షాల వలన సమస్యలు ఎదుర్కొంటున్న సోదర, సోదరీమణులతోనే ఉన్నాయని డిఎంకె వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎంకె. స్టాలిన్‌ పేర్కొన్నారు. తమిళనాడు ప్రభుత్వాన్ని సహకారం అందించాల్సిందిగా తాను కోరుకుంటున్నానని, అలాగే డిఎంకె కార్యకర్తలు కూడా సహాయ చర్యలు చేపట్టాల్సిందిగా ఆయన ట్విటర్‌లో తెలిపారు. వరదలలో మృతి చెందిన వారికి తన సంతాపాన్నితెలుపుతున్నట్లు శిరోమఱి అకాలీ దళ్‌ నేత సింగ్‌ బాదల్‌ ప్రకటించారు.