వరుసగా మూడోరోజూ ఉక్రెయిన్‌పై దాడులు
ప్రపంచాన్ని వెన్నాడుతున్న అణుభయాలు
రష్యా పరోక్ష హెచ్చరికలతో సర్వత్రా ఆందోళన
ఉక్రెయిన్ సంక్షోభానికి త్వరగా ముగింపు పలికితేనే భరోసా
మాస్కో,ఫిబ్రవరి26(జనం సాక్షి): ఉక్రెయిన్‌పై రష్యా మూడో రోజూ దాడులను కొనసాగిస్తోంది.ఓ వైపు చర్చలకు సిద్ధమని ఉక్రెయిన్ అధ్యక్షుడు చెప్పడం.. దానికి రష్యా అధ్యక్షుడు వ్లాదివిూర్ పుతిన్ ఓకే అన్నప్పటికీ యుద్ధం మాత్రం జరుగుతూనే ఉంది. రష్యా సైన్యం విధ్వంసం సృష్టిస్తూనే ఉంది. అసలు ఎటునుంచి ఎప్పుడు తూటాల వర్షం కురుస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది.. దీంతో క్షణం.. క్షణం భయంగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అక్కడి పౌరులు బతుకుతున్నారు. ఈ తరుణంలో రష్యా విదేశాంగ మంత్రిత్వశాఖ కీలక ప్రకటన చేసింది. కీవ్‌లో తోలుబొమ్మ పాలన అణచివేతకే సైనిక చర్య చేపడుతున్నామని.. అణచివేత నుంచి ఉక్రెయిన్లు విముక్తి పొందాలని రష్యా చెబుతోంది. మిలటరీ ఆపరేషన్ తర్వాత దళాలను విరమించుకుంటామని.. తమకు ఉక్రెయిన్ భూభాగం అక్కర్లేదని.. అయితే అక్కడ మాత్రం కొత్త ప్రభుత్వం రావాలని రష్యా అంటోంది. ఇకపోతే రెండో ప్రపంచ యుద్ద కాలంలో జపాన్‌పై జరిగిన అణుదాడి నుంచి ప్రపంచం ఇప్పటికీ భయపడుతూనే ఉంది. అనేక దేశాలు అణు సామర్థ్యాన్ని కలిగి ఉండడం ఆందోళనకు కలిగిస్తోంది. తాజాగా ఉక్రెయిన్‌పై దాడి సందర్భంగా రష్యా
పరోక్షంగా అణు సామర్థ్యంపైనా పరోక్ష హెచ్చరికలు చేసినందున ప్రపంచం వణకాల్సి వస్తోంది. ఇప్పటికే కరోనా ఓ బయోవార్‌గా భయపడు తున్న ప్రజలకు ఇది మరింత భయానికి గురిచేస్తోంది. జపాన్‌పై అణుదాడి తరవాత ప్రపంచదేశాలు అణుదాడులంటేనే భయానికి గురయ్యాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం అణుఖడ్గాన్ని దూసేందుకు ప్రయత్నిస్తున్నారనే ప్రచారం వస్తోంది. ఐరోపా దేశాల కట్టడికి ఆయన ఆ దిశగా అడగులు వేస్తున్నారని ప్రపంచ దేశాలంటున్నాయి. ఉక్రెయిన్‌పై యుద్దానికి ముందు ఆయన ప్రకటనను చూస్తే ఈ సందేహాలే కలుగుతున్నాయని అంతర్జాతీ య విశ్లేషకులు అంటున్నారు. ఉక్రెయిన్‌పై యుద్ధంలో ఎవరైనా జోక్యం చేసుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు.ఉక్రెయిన్ విషయంలో అమెరికా జోక్యం చేసుకుంటే అణుయుద్ధం తప్పదనే సంకేతాలిచ్చినట్టు ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. మరో పర్యావరణ పెనుముప్పు పొంచి ఉందని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి హెచ్చరించడం గమనార్హం. మరోవైపు 1945 తర్వాత ఏ దేశమూ అణ్వాయుధాలు వినియోగించ లేదు. ప్పుడు జపాన్‌లోని హిరోషిమా, నాగసాకిలపై వేసిన అణుబాంబులతో 2 లక్షల మంది పౌరులు మృతి చెందారు. ఉక్రెయిన్, రష్యాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నప్పటి నుంచి రష్యా`నాటోల మధ్య అణు యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఆయన ఉక్రెయిన్‌కు నాటో ఎలాంటి బలగాలనూ పంపించదని చెప్పారు. ఎందుకంటే ఇదే జరిగితే.. అమెరికా, రష్యాల మధ్య అణుయుద్ధం ఏర్పడి మూడో ప్రపంచ యుద్దానికి దారితీసే పరిస్థితి వస్తుందని భయపడుతున్నారు. అందేకే రష్యాపై ఆర్థిక ఆంక్షలకు సిద్ధమ య్యారు. రష్యా దూకుడు పెంచి నాటో సభ్య దేశాలపై దాడులు చేస్తే అమెరికా తన వ్యూహాలను మార్చు కునే అవకాశముంది. మరోవైపు తమ అణు సామర్థ్యంపై బైడెన్ సవిూక్ష నిర్వహించడం గమనార్హం. ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ రంగంలోకి దిగి అమెరికా, రష్యాల మధ్య సయోధ్యకు కొంత ప్రయత్నం చేసారు. ఇప్పుడు రష్యా అధికారికంగా గుర్తిస్తానంటున్న రెండు తిరుగు బాటు ప్రాంతాలూ ఇప్పటికే కరెన్సీ నుంచి జాతీయగీతం వరకూ అన్ని విషయాల్లోనూ రష్యాతోనే నడుస్తున్నాయి. ఈ యుద్ధం ఎలా పరిణమిస్తుందో ఇప్పుడే ఎవరూ చెప్పలేరు. సాధ్యమైనంత త్వరగా ఆ దేశం నుంచి తన సేనలను రష్యా ఉపసంహరించుకోవాలని ప్రపంచవ్యాప్తంగా శాంతివాదులు అందరూ కోరుతున్నారు. ఆందోళనకరమైన విషయమేమిటంటే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన చర్యను సమర్థించుకోవడానికి ఇరాక్‌లో అమెరికా వేలు పెట్టడాన్ని గుర్తు చేస్తున్నారు. మళ్లీ ప్రపంచ అగ్రరాజ్యంగా వెలుగొందేందుకు రష్యా తహతహలాడుతోంది.