వరుస వర్షాలకు డెల్టా రైతుల ఆందోళన
నీట మునిగిన వరిచేలతో తీవ్ర నష్టం
ఏలూరు,జూలై13(జనం సాక్షి): జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండగా మెట్ట కంటే డెల్టాలోనే ఎక్కువ నారుమళ్లు, ఊడ్చిన పొలాలు దెబ్బతిన్నాయి. నరసాపురం, పాలకొల్లు, మొగల్తూరు, ఉండి, పెనుమంట్ర వంటి ప్రాంతాల్లో సమస్య తీవ్రంగా ఉందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు.మురుగు కాలువల్లో ప్రవాహం సరిగ్గా లేక నీరు ఎగదన్నుతోంది. ఆక్వా పరిశ్రమల వ్యర్థాలతో నీరు ముందు కెళ్లక పక్కనున్నపొలాల్లోకి చేరుతోంది. జిల్లాలో ఏర్పడిన సమస్యలపై ఇప్పటికే అధికారులు రంగంలోకి దిగారు. ఆయా మురుగుకాలువల్లో పేరుకున్న చెత్తను తొలగిస్తున్నారు.వరి నారుమళ్లు, ఊడ్చిన పొలాల్లో వారం రోజులు నీరు నిలిచి ఉంటే నష్టం వాటిల్లుతుందని వ్యవసాయ శాఖాధికారులు చెబుతున్నారు. ఇప్పటికే మూడురోజులుగా నారు నానుతున్నందున వీలైనంత త్వరగా నీటిని తీసేయాలని సూచిస్తున్నారు. రైతులు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు. అయితే నారుమళ్లలో రెండు మూడురోజులు నీరు నిలిచినంత మాత్రాన రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఏమాత్రం అవకాశమున్నా పొలాల్లోని నీటిని బయటకు తోడేయాలని, అందుకు ఇప్పటికే జలవనరుల శాఖ అధికారులతో మాట్లాడామని అన్నారు. డెల్టాలో అక్కడక్కడా డ్రెయిన్ల సమస్య ఉన్నందున నీటిని దిగువకు పంపేలా ఏర్పాట్లు చేస్తున్నాం. ఏదైనా సమస్య ఉంటే రైతులు వ్యవసాయ అధికారులను సంప్రదించాలని అన్నారు. ఎడతెరపి లేని వర్షం అన్నదాతను నిండా ముంచుతోంది. ఐదారు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతుండటంతో పొలాల్లోకి భారీగా వరదనీరు చేరి వరి నారుమళ్లను ముంచెత్తింది. అధికారిక లెక్కల ప్రకారం 350 హెక్టార్లలో నారుమళ్లు దెబ్బతిన్నట్టు చెబుతున్నా.. వందల హెక్టార్లలో పాడైనట్లు తెలుస్తోంది. పంట పొలాల్లోని నీటిని బయటకు తోడటానికి రైతులు అష్టకష్టాలు పడుతున్నారు.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వ్యవసాయశాఖ అంచనా ప్రకారం వెయ్యి హెక్టార్లలో నారు మునకకు గురైంది. అయితే ఇవన్నీ కాకిలెక్కలేనని రైతు, కౌలు రైతు సంఘాల నాయకులు అంటున్నారు. తక్కువ చేసి లెక్కలు చూపుతున్నారని ఆరోపిస్తున్నారు.