వర్షాకాలంలో కరెంటు పట్ల జాగ్రత్తలు పాటించండి
-విడబ్ల్యూ సిరిపంగి నరేష్
మహబూబాబాద్ బ్యూరో-జూలై13(జనంసాక్షి)
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గార్ల ప్రజలంతా విద్యుత్ పట్ల జాగ్రత్తగా ఉండాలని ఎవరూ విద్యుత్ స్తంభాలను పట్టుకోవద్దని, పిల్లలను బైటికి పంపకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, పశువులను విద్యుత్ స్తంభాలకు కట్టేయవద్దని గార్ల విడబ్ల్యూ సిరిపంగి నరేష్ హెచ్చరించారు. గత ఐదురోజులుగా ఆగకుండా కురుస్తున్న వర్షాలతో ఇళ్లలోని కరెంటు వైరింగ్ లైన్లలో నీరు చేరి గోడలలో షాట్ సర్క్యూట్ వచ్చే అవకాశాలు ఉండవచ్చని, ఇళ్లలో స్విచ్ లు పేసేప్పుడు చేతులు తడి లేకుండా చూసుకోవాలని, మొబైల్ ఫోన్లు ఛార్జింగ్ పెట్టి వాడకూడదని, బట్టలు ఆరవేసేందుకు దండాలు ఇనుప తీగలతో కట్టవద్దని అన్నారు. వృక్షాలు కూలి విద్యుత్ తిగలపై పడి తీగలు తెగిపడి కనిపిస్తే వెంటనే విద్యుత్ కార్యాలయానికి సమాచారం ఇవ్వాలని అటువంటి ప్రదేశాలలో అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. రైతులు వ్యవసాయ మోటర్ల దగ్గరికి వెళ్లవద్దని, వ్యవసాయ పొలాలకు వెళ్లే సమయంలో మెయిన్ పవర్ లైన్ కింద నడవవద్దని హైటెన్షన్ వైర్లు తెగిపడే ప్రమాదం ఉండవచ్చని, హైటెన్షన్ స్థంబాలవద్ద ఉండడంవల్ల పిడుగులు పడే ప్రమాదం ఉందని విద్యుత్ నుండి ప్రజలు జాగ్రత్తలు పాటించాలని నరేష్ కోరారు.