వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తం

మున్నేరు వాగు ఉధృతిని పరిశీలించిన మంత్రి పువ్వాడ

ఖమ్మం,జూలై11(జనం సాక్షి ):రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ ఆదేశించారు. ఈ మేరకు ఖమ్మం కాల్వ ఒడ్డు మున్నేరు పరివాహక ప్రాంతాన్ని మేయర్‌ పునుకొల్లు నీరజ, జిల్లా కలెక్టర్‌ వీపీ గౌతమ్‌, పోలీస్‌ కమిషనర్‌ విష్ణు ఎస్‌.వారియర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ ఆదర్శ్‌ సురభితో కలిసి మంత్రి సందర్శించారు. మున్నేరు వరద ఉధృతిని పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. ప్రస్తుతం ఎలాంటి ముప్పు లేదని, వరద ఉధృతం అయితే వరద ముంపు ప్రాంతాల వారిని స్థానిక నాయబజార్‌ కళాశాలలో పునరావాసం కల్పించనున్నట్లు తెలిపారు. వారికి భోజనం, తాగునీరు, కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు వరద ఉధృతిపై సహాయక చర్యలకై అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఇప్పటి వరకు ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కలగలేదని, అయినప్పటికీ అన్ని విధాలుగా అప్రమత్తంగా ఉన్నామని పేర్కొన్నారు. వర్షకాలంలో గ్రామాల మధ్య ఉన్న చిన్నచిన్న వాగులను దాటే ప్రయత్నం చేయొద్దని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వారి వెంట సుడా చైర్మన్‌ బచ్చు విజయ్‌, ఆర్డీవో రవీంద్రనాథ్‌, ఇరిగేషన్‌ డీఈ ఉదయ్‌ ప్రతాప్‌, తహశీల్దార్‌ శైలజ, కార్పొరేటర్లు, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.