వసతి ఏర్పాట్లపై అథ్లెట్ల అసంతృప్తి

– గదులు విశాలంగా లేవంటూ ఆందోళన
జకార్తా, ఆగస్టు18(జ‌నం సాక్షి) : ఇండోనేషియా వేదికగా 18వ ఆసియా క్రీడలు శనివారం సాయంత్రం ప్రారంభమయ్యాయి. 45 దేశాల నుంచి 10వేల మందికిపైగా అథ్లెట్లు ఈ క్రీడల బరిలో దిగనున్నారు. భారత్‌ నుంచి 572మంది అథ్లెట్లు 36 క్రీడాంశాల్లో పోటీలకు సిద్ధమయ్యారు. ఇందుకోసం ఇప్పటికే అన్ని దేశాలకు చెందిన ఆటగాళ్లు క్రీడా గ్రామానికి చేరుకున్నారు. క్రీడాకారుల కోసం ఇండోనేషియా అన్ని ఏర్పాట్లు చేసింది. ఐతే, వసతి ఏర్పాట్లపై పలువురు అథ్లెట్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గదులు చాలా చిన్నవిగా ఉన్నాయని, కాస్త విశాలంగా ఉంటే బాగుండేదని అంటున్నారు. దీనిపై వివిధ దేశాలకు చెందిన క్రీడాకారులు మాట్లాడుతూ.. గదులు చాలా చిన్నగా ఉన్నాయని, ఒక్కో గదిలో ముగ్గురు ఉండాల్సి వస్తుందని, ఒక బాత్రూమ్‌ ఉందని, గదులు కాస్త విశాలంగా ఉంటే సౌకర్యవంతంగా ఫీలయ్యేవాళ్లమని పేర్కొన్నారు. మిగతా క్రీడాకారుల గదులు కూడా ఇలాగే ఉన్నాయా అంటూ పలువురు అథ్లెట్లు అనుమానం వ్యక్తం చేశారు. గదులు చాలా చిన్నగా ఉన్నాయి, ఇదొక్కటే సమస్య. ఫుడ్‌ విషయంలో ఎలాంటి సమస్యలు లేవని, మన దేశానికి సంబంధించిన వంటకాలను ఇక్కడ అందుబాటులో ఉంచారన్నారు. చికెన్‌, పప్పు, పన్నీర్‌తో పాటు పలు వంటకాలు ఉన్నాయి అని భారత్‌ అథ్లెట్స్‌ పేర్కొన్నారు.