వామపక్షాల ఆధ్వర్యంలో మోటార్ సైకిల్ ర్యాలీ, ఎమ్మార్వో ఆఫీస్ ముందు ధర్నా
బయ్యారం,జులై20(జనంసాక్షి):
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని కాకతీయుల కాలంలో నిర్మించిన బయ్యారం పెద్ద చెరువు కాలువల శాశ్వతమరమ్మతులు చేయాలని బుధవారం వామపక్షాల ఆధ్వర్యంలో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించి,ఎమ్మార్వో ఆఫీస్ ముందు ధర్నా అనంతరం వినతి పత్రం సమర్పించారు.
ఈ ధర్నాను ఉద్దేశించి వామపక్ష పార్టీల నాయకులు మండా రాజన్న,గౌని ఐలయ్య, నందగిరి వెంకటేశ్వర్లు, ముల్పురి జగ్గన్న,కళింగ రెడ్డి,ఎస్ కే సైదులు… మాట్లాడుతూ కాకతీయుల కాలంలో నిర్మించిన బయ్యారం పెద్ద చెరువు పాలకుల నిర్లక్ష్యానికి గుర్తుగా ఈ చెరువు కనబడుతున్నదని,ఎన్నికలు వచ్చినప్పుడు పదేపదే బయ్యారం పెద్ద చెరువులకు శాశ్వత మరమ్మతులు చేస్తామని రైతులకు హామీ ఇస్తూ ఎన్నికలలో పబ్బం గడుపుకుంటూ కాలం వెల్లదీస్తున్నారని విమర్శించారు.
మొన్నటికి మొన్న రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు స్థానిక ఎమ్మెల్యే వచ్చి కాలువల మరమ్మతులు చేస్తామని టెంకాయలు కొట్టి పనులు ప్రారంభిస్తున్నామని రైతులను మభ్యపెట్టారనికానీ ఇంతవరకు పనులు మొదలు పెట్టింది లేదు..కాలువలు మరమ్మతులు చేసింది లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.బయ్యారం నుంచి శివరాయకట్టు రైతులకు సాగునీరు అందించాల్సిన అవసరం ఉన్నదని, శివరాయకట్టు రైతులకు సక్రమంగా సాగునీరు అందక రైతులు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికి అస్తవ్యస్తంగా ఉన్న కాలువలు ఎప్పుడు పూర్తి చేస్తారని ప్రజాప్రతినిధులను, ప్రభుత్వ అధికారులను, ఇరిగేషన్ అధికారులను ప్రశ్నించారు.ఇప్పటికే నార్లు పోసుకొని,ఇంకో వారం రోజుల్లో నాట్లకు వచ్చే సందర్భం ఉన్నదని, ప్రతి సంవత్సరం నాట్లు వేసే సందర్భంలో తూములు తీసిన తర్వాత జెసిబి పెట్టి మొక్కుబడిగా కాలువల్ని గండ్లు పూడుస్తూ,లాభాలు గడించుతూ ప్రభుత్వ ప్రజాప్రతినిధులు రైతులను మోసం చేస్తున్నారని, శివరాయకట్టు రైతులకు సక్రమంగా నీరందక ఇబ్బందులు పడుతున్నారని, ఇప్పటికైనా పాలకులు రైతులకు ఇచ్చిన హామీని అమలుపరిచే విధంగా నిధులు మంజూరు చేసి కాల్వల్ని యుద్ధ ప్రాతిపదికపై పూర్తి చేసి సక్రమంగా నీరందే విధంగా చూడాలని ఈ ప్రాంత మంత్రి, ఎంపీ,ఎమ్మెల్యే,జిల్లా పరిషత్ చైర్పర్సన్ వివిధ ప్రజాప్రతినిధులను,ప్రభుత్వ అధికారులను,ఇరిగేషన్ అధికారులను డిమాండ్ చేశారు. లేనియెడల రైతులను, అఖిలపక్ష పార్టీల నాయకులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళనకు ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో వాపక్షాల నాయకులు తులసి యాదగిరి,నిడికొండ చంటి, ఉమ్మ గానిసత్యం,రామచంద్ర మురళి,పద్మ వీరభద్రం, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.