వారం రోజుల తర్వాత తీరానికి!

– ఒడ్డుకు చేరిన సముద్రంలో గల్లంతైన ఏడుగురు మత్స్యకారులు
కాకినాడ, ఆగస్టు18(జ‌నం సాక్షి) : సముద్రంలో చేపల వేటకు వెళ్లి గల్లంతైన ఏడుగురు మత్స్యకారులు క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా దమ్ములపేటకు చెందిన ఏడుగురు మత్స్యకారులు ఈ నెల తొలి వారంలో సముద్రంలో చేపలవేటకు వెళ్లారు. వీరు 11వ తేదీన తీరానికి చేరుకోవాల్సి ఉంది. అయితే 14వ తేదీ దాటినా ఏడుగురు తిరిగి రాకపోకవడంతో వారి కుటుంబసభ్యులు ఆందోళన పడ్డారు. కాకినాడ నగర ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరావును కలిసి తమ గోడు చెప్పుకున్నారు. ఆయన ఆదేశాల మేరకు అధికారులు సముద్రంలో గాలింపు చేపట్టారు. వీరంతా శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం చేరుకున్నట్లు గుర్తించి స్వస్థలానికి తీసుకొచ్చారు. తాము చేపలవేటకు వెళ్లిన తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయి పడవ దిశ మారినట్లు మత్స్యకారులు చెబుతున్నారు. దీంతో తాము చాలా ఆందోళన పడ్డామని.. చివరికి కళింగపట్నం వద్ద తీరానికి చేరుకున్నామన్నారు. ప్రభుత్వం సహాయచర్యలు చురుగ్గా చేపట్టడం వల్లనే తాము తిరిగి రాగలిగామని సంతోషం వ్యక్తం చేశారు. తాము ఇళ్లు చేరేందుకు సహకరించిన ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావుకు ధన్యవాదాలు తెలిపారు. ఇదిలా ఉంటే వారం రోజులుగా ఎటువెళ్లారో సమాచారం లేకపోవటంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు వారి రాకతో ఆనందం వ్యక్తం చేశారు.
—————————–

తాజావార్తలు