వాల్‌మార్ట్‌ డీల్‌పై నిరసనలు

సెప్టెంబర్‌ 28న బంద్‌కు సీఏఐటీ పిలుపు

న్యూఢిల్లీ,ఆగస్ట్‌21(జ‌నం సాక్షి): వాల్‌మార్ట్‌-ఫ్లిప్‌కార్ట్‌ మధ్య కుదిరిన డీల్‌ను నిరసిస్తూ.. వచ్చే నెల 28న భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చింది కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆలిండియా ట్రేడర్స్‌ (సీఏఐటీ). దేశంలోని వర్తకులు ఈ డీల్‌పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇది దేశంలోని చిల్లర వర్తకాన్ని తీవ్రంగా దెబ్బతీసే దురుద్దేశంతో కుదిరిన డీల్‌ అని, ప్రభుత్వం 2016లో విడుదల చేసిన ప్రెస్‌నోట్‌ నంబర్‌ 3ని ఇది ఉల్లంఘించిందని సీఏఐటీ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌ ఖండేల్వాల్‌ అన్నారు. ఈ డీల్‌కు వ్యతిరేకంగా సెప్టెంబర్‌ 15 నుంచి దేశవ్యాప్తంగా రథయాత్ర ప్రారంభించనున్నట్లు సీఏఐటీ ఒక ప్రకటనలో వెల్లడించింది. వర్తకులపై వివక్షపూరితంగా వ్యవహరిస్తున్నందుకు నిరసనగా డిసెంబర్‌ 16న భారీ ర్యాలీ తీస్తామని చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న 200 మంది ప్రముఖ వర్తక నేతలు ఆదివారం సమావేశం నిర్వహించి ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నారు.వాల్‌మార్ట్‌-ఫ్లిప్‌కార్ట్‌ డీల్‌ను వ్యతిరేకిస్తూ సెప్టెంబర్‌ 28న భారత్‌ వ్యాపార బంద్‌ నిర్వహిస్తున్నామని, దేశవ్యాప్తంగా అన్ని మార్కెట్లు పూర్తిగా మూతపడతాయని సీఏఐటీ తెలిపింది. ఆయా నగరాల్లో నిరసన ర్యాలీలు కూడా జరపనున్నారు. లక్ష కోట్ల విలువైన వాల్‌మార్ట్‌-ఫ్లిప్‌కార్ట్‌ డీల్‌ వల్ల సాంప్రదాయ దుకాణాలు మూతపడే పరిస్థితి వస్తుందని, అందువల్ల వీళ్ల డీల్‌ను రద్దు చేయాలని వర్తక సంఘం గతంలోనే ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. ఇది భారత చిల్లర వర్తకంలోకి వాల్‌మార్ట్‌ వెనుక డోరు ద్వారా రావడమే అవుతుంది. ముందు పోటీని తొలగించుకోవడానికి ధరలు భారీగా తగ్గించి తర్వాత పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి అని సీఏఐటీ గుజరాత్‌ అధ్యక్షుడు ప్రమోద్‌ భగత్‌ అన్నారు.

———————-