విండీస్ మహిళలదే వరల్డ్ కప్
తొలిసారి ట్రోఫీని ముద్దాడిన కరేబియన్ మహిళలు
డిఫెండింగ్ ఛాంపియన్ ఆసీస్‌కు షాక్
ఛేదనలో రాణించిన విండీస్ ఓపెనర్లు కోల్‌కతా: టీ20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్ మహిళల జట్టు తొలిసారి విజేతగా నిలిచింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా విసిరిన 149 పరుగుల లక్ష్యాన్ని వెస్టిండీస్ మహిళల జట్టు మరో మూడు బంతులు మిగిలి ఉండగానే 149/2తో అలవోకగా ఛేదించి తొలిసారి ట్రోఫీని ముద్దాడింది. ఛేదనలో వెస్టిండీస్ ఓపెనర్లు మాథ్యూస్ (66: 45 బంతుల్లో 6×4, 3×6), కెప్టెన్ టేలర్ (59: 57 బంతుల్లో 6×4) ఆసీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగి తొలి వికెట్‌కి 15.4 ఓవర్లలో ఏకంగా 120 పరుగుల భాగస్వామ్యంతో ఔరా అనిపించారు. ఈ జోడిని విడదీసేందుకు ఆసీస్ కెప్టెన్ మెగ్ లానింగ్ బౌలర్లను మారుస్తూ తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. అయితే జట్టు స్కోరు 120 వద్ద భారీ షాట్‌కు ప్రయత్నించి మాథ్యూస్ ఔటైనా.. తర్వాత వచ్చిన దోతిన్ (18: 12 బంతుల్లో 2×4)తో కలిసి స్కోరు బోర్డును నడిపించిన టేలర్ వెస్టిండీస్ విజయానికి 8 బంతుల్లో 5 పరుగులు చేయాల్సిన దశలో ఔటైంది. ఈ దశలో నిలకడగా ఆడి కూపర్‌తో కలిసి దోతిన్ గెలుపు లాంఛనాన్ని పూర్తి చేసి వెస్టిండీస్ జట్టును సంబరాల్లో ముంచెత్తింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. ఓపెనర్ హేలీ(4) జట్టు 15 పరుగుల వద్దే ఔటై నిరాశపరిచినా.. ఎల్సీ విలనీ (52; 37 బంతుల్లో 9×4), కెప్టెన్ మెగ్ లానింగ్ (52; 49 బంతుల్లో 8×4) దూకుడుగా ఆడుతూ.. అర్ధశతకాలతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లకు ఆ జట్టు 5 వికెట్లు నష్టపోయి 148 పరుగులు చేసింది. మిడిలార్డర్ బ్యాట్స్‌వుమన్ ఎల్సీ పెర్రీ (28) ఫర్వాలేదనిపించింది. విండీస్ బౌలర్లలో డియాండ్ర డాటిన్ 2, హేలీ మాథ్యూస్, అనిసా మహ్మద్ చెరో వికెట్ తీశారు.