విఆర్‌ఎల కలెక్టరేట్ ముట్టడి
ధర్నాకు కాంగ్రెస్ మద్దతు
మేడ్చల్,జూలై23(జనంసాక్షి)వీఆర్‌ఏలు జిల్లా కలెక్టరేట్ ను ముట్టడిరచారు. తెలంగాణ రాష్ట్ర వీఆర్‌ఏ జెఏసి పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న వీఆర్‌ఏలు కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు. అయితే భారీ సంఖ్యలో మొహరించిన పోలీసులు వీఆర్‌ఏలను అడ్డుకుని ఆపేశారు. శాంతియుతంగా నిరసన నిర్వహిస్తామని వీఆర్‌ఏలు సర్దిచెప్పి ధర్నా చేపట్టారు. ఔటర్ రింగ్ రోడ్డు నుండి ర్యాలీగా వచ్చిన వీఆర్‌ఏలు మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 195 మంది వీఆర్‌ఎలు ఈ ధర్నాలో పాల్గొన్నారు. వీఆర్‌ఏల ధర్నాకు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా మద్దతు ప్రకటించారు. వీఆర్‌ఏలకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా వీఆర్‌ఏ అధ్యక్షురాలు లక్ష్మీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ప్రకటించిన విధంగా వీఆర్‌ఎలకు వెంటనే పే స్కెల్ ఇవ్వాలి అన్నారు. అలాగే తమకు రావాల్సిన ప్రమోషన్స్ కూడా వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. మేడ్చల్ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ హరివర్ధన్ రెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీ సాక్షిగా వీఆర్‌ఎలకు ప్రమోషన్లు, పే స్కెల్, 55 సంవత్సరాలు నిండిన వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇస్తామన్న కేసీఆర్ మాట తప్పారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు వీఆర్‌ఎలకు మద్దత్తు ప్రకటించామన్నారు. వీఆర్‌ఏలకు న్యాయం జరిగే వరకు వారు చేపట్టే పోరాటంలో పాల్గొంటామని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వీఆర్‌ఏలకు పూర్తిగా న్యాయం చేస్తామని తెలిపారు.