వికారాబాద్ మండలంలో జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ సుడిగాలి పర్యటన
వికారాబాద్ రూరల్ జూలై 25 జనం సాక్షి
వికారాబాద్ మండలంలోని పెండ్లిమడుగు, ఎర్రవల్లి, ద్యాచారం గ్రామాలలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ మంగళవారం విస్తృతంగా పర్యటించి పరిశీలించారు.
ఈ సందర్భంగా గ్రామాలలో నిర్వహిస్తున్న నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలు, క్రీడా ప్రాంగణాలు, వైకుంఠధామాల నిర్వహణ బాగున్నదని ద్యాచారం గ్రామ సర్పంచ్, కార్యదర్శిని ఆయన అభినందించారు. అధికారులందరూ కలిసి పనిచేస్తే గ్రామాలను అభివృద్ధి చేసుకోవచ్చని అన్నారు. ద్యాచారం గ్రామంలో పల్లె ప్రకృతి వనంలో పెంచిన మొక్కలు బాగున్నాయని, నర్సరీ నిర్వహణ కూడా బాగుందన్నారు.ద్యాచారం గ్రామంలో కమ్యూనిటీ సోక్ పిట్స్,ఇంకుడు గుంతలు లక్ష్యం మేరకు ఏర్పాటు చేసుకున్నందుకు సంతృప్తి వ్యక్తపరిచారు. హరితహారంలో భాగంగా అన్ని గ్రామాలలో అవెన్యూ ప్లాంటేషన్ కు ప్రాధాన్యత నివ్వాలని అన్నారు. విస్తారంగా వర్షాలు కురుస్తున్నందున గ్రామాలలో దోమలు, అంటు వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య పనులు చేపట్టి మురికి నీరు నిలవకుండా చూడాలన్నారు. ఈ సందర్భంగా అన్ని గ్రామాలలోని గ్రామ పంచాయతీ కార్యాలయాలలో గల రికార్డులను ఆయన తనిఖీ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ శ్రీనివాసరావు, జిల్లా అటవీ శాఖ అధికారి జ్ఞానేశ్వర్, ఎంపీడీవో సత్తయ్య, డివిజనల్ పంచాయతీ అధికారి అనిత, ఎంపీ ఓ నాగరాజు, గ్రామ సర్పంచులు, గ్రామ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.