విజయనగరంలో ప్రవేశించిన బస్సుయాత్ర

జిల్లాలో హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించాలన్న మధు

విజయనగరం,సెప్టెంబర్‌3(జ‌నం సాక్షి): నూతన రాజకీయ ప్రత్యామ్నాయం కోసం సిపిఐ-సిపిఎంఆధ్వర్యంలో ఈ నెల 15న చేపట్టనున్న మహాగర్జన సిద్ధతకు చేపట్టిన సిపిఎం-సిపిఐ బస్సు యాత్ర ఆదివారం విశాఖలో దిగ్విజయంగా పూర్తిచేసుకొని సోమవారం జయభేరితో విజయనగరంలో ప్రవేశించింది. సోమవారం ఉదయం 10 గంటలకు విజయనగరంలోని బొబ్బిలిలో ఎలక్ట్రికల్‌ యూనియన్‌ కార్యాలయంలో సభ నిర్వహించారు. సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు మాట్లాడుతూ.. జిల్లాలో డెంగ్యూ విష జ్వరాలతో ఇప్పటికి 60 మంది మృతి చెందారని, ప్రభుత్వం విజయనగరంలో హెల్త్‌ ఎమర్జెన్సీని ప్రకటించాలని చెప్పారు. జిల్లాలో వైద్యులను నియమించే విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఎద్దేవా చేశారు. విజయనగరంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డాక్టర్ల కొరత తీవ్రంగా ఉందని, పార్వతీపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 48 డాక్టర్లకు బదులు ప్రస్తుతం 8మంది మాత్రమే ఉన్నారని, ప్రభుత్వం స్పందించి కొత్త డాక్టర్ల నోటిఫికేషన్‌ విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శులు ముప్పాల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రస్తుతం టిడిపి, వైసిపి నాయకులు పార్టీలు మారుతున్నారు కాని ప్రజా సమస్యలేవీ మారడం లేదని విమర్శించారు. జిల్లా విద్య, వైద్య రంగాల్లో తీవ్ర సమస్యల్ని ఎదుర్కొంటోందని తెలిపారు. మూడవ రాజకీయ ప్రత్యామ్నాయం కోసమే సిపిఎం-సిపిఐ బస్సు యాత్ర చేపట్టామని వ్యాఖ్యానించారు.

—————-

 

తాజావార్తలు