విడిపోవడానికి ఎవరి అనుమతి అవసరం లేదు

కలహాల కాపురం ఇక సాగదు : కేకే
కేవీపీ దొంగ చరిత్ర బయటపెడతా : మధుయాష్కీ
న్యూఢిల్లీ, జనవరి23 (జనంసాక్షి):
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుందని తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ఎంపీలు స్పష్టం చేశారు. రాష్ట్ర సాధన విషయంలో వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. కలిసి ఉండడానికి ఇద్దరి మధ్య అవగాహన అవసరమని, విడిపోవడా నికి ఎవరి అనుమతి అక్కర్లేదని సీనియర్‌ నేత కే.కేశవరావు స్పష్టం చేశారు. కలిసి ఉండడానికి తాము సిద్ధంగా లేమని స్పష్టం చేశారు. తమకు ఇష్టం లేనప్పుడు తమతో ఎలా కలిసి ఉంటారని ప్రశ్నించారు. బుధవారం ఢిల్లీలో టీ-ఎంపీలతో కలిసి విూడియాతో మాట్లాడారు. కలిసి ఉండడానికి అవగాహన అవసరం తప్పా విడిపోవడానికి ఎవరి అనుమతి అసవరం లేదన్నారు. తెలంగాణ విషయంలో ఎక్కడా వెనక్కు తగ్గేది లేదని స్పష్టం చేశారు. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ తప్పా మరే ప్రత్యామ్నాయాలను అంగీకరించేది లేదన్నారు. తెలంగాణ వచ్చి తీరుతుందని తేల్చి చెప్పారు. ప్రత్యేక తెలంగాణ చివరి దశలో ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుందని, రాకపోతే తామే సాధించుకుంటామని స్పష్టం చేశారు. తెలంగాణ ఇస్తామని మానిఫెస్టోలో లేదని సీమాంధ్ర నేతలు చేస్తున్న వాదనలు తప్పని కేకే తెలిపారు. 2004 ఎన్నికల నాటి మేనిఫెస్టోలో స్పష్టంగా ఉందని చెప్పారు. ఇంతదాకా వచ్చాక ఇక రాష్ట్రం విడిపోవాల్సిందేనని, కలిసి ఉండడం ఎంత మాత్రం సాధ్యం కాదన్నారు. తెలంగాణకు అడ్డుపడుతున్న లగడపాటి వంటి వారికి ప్రజలే బుద్ది చెబుతారని తెలిపారు.ఎంపీ మధుయాష్కీ మాట్లాడుతూ.. ఈసారి తెలంగాణను ఇవ్వకపోతే బలిదానాలు ఉండవని, బలవంతంగా లాక్కుంటామని తెలిపారు. తెలంగాణకు అడ్డుపడే వారిని సంఘ బహిష్కరణ చేయాలన్నారు. కేవీపీ రామచంద్రరావుపై యాష్కీ ధ్వజమెత్తారు. తెలంగాణను అడ్డుకొనేందుకు కేవీపీ కుట్ర చేస్తున్నాడని మండిపడ్డారు. కృత్రిమ ఉద్యమం సృష్టించేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణను అడ్డుకొనేందుకు కృత్రిమ ఉద్యమాలు సృష్టిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. తెలంగాణ రాష్టాన్రికి అడ్డుపడుతున్న కేవీపీ.. తన ఆప్తమిత్రుడు వైఎస్‌ రాజశేఖరరెడ్డి రాష్ట్ర విభజనకు అనుకూలమేనన్నారు. తెలంగాణ కోసం ఎమ్మెల్యేలతో సంతకాలు చేయించింది, ఢిల్లీ పంపించింది వైఎస్‌ కాదా? అని ప్రశ్నించారు. జైలులో ఉండాల్సిన కేవీపీ చరిత్రను త్వరలోనే బయటపెడతానని స్పష్టం చేశారు. లగడపాటి, కేవీపీ డబ్బులతో 1001 అబద్దాలతో ‘నూటొక్క అబద్దాల పుసక్తాన్ని’ ప్రచురించారని ధ్వజమెత్తారు. పరకాల ప్రభాకర్‌ ప్రచురించిన ఈ పుస్తకం టిష్యూ పేపర్‌తో సమానమన్నారు. ఇది అంతిమ పోరాటమని, తెలంగాణ ప్రజలు ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. రాజకీయ, రాజకీయేతర శక్తులన్నీ ఏకమై ఉద్యమాన్ని ఉద్ధృతం చేయాలని కోరారు.సీమాంధ్రులతో కలిసి ఉండలేమని, విడపోక తప్పదని గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. 1956లో బలవంతపు పెళ్లి చేశారని, అప్పటి నుంచి బలవంతంగానే కాపురం చేస్తున్నామన్నారు. ఇక కలిసి ఉండలేమని, అందుకే విభజన కావాలని కోరుతున్నట్లు స్పస్టం చేశారు. సీమాంధ్ర నేతలు ఢిల్లీలో జరిగిన గ్యాంగ్‌రేప్‌కు పాల్పడిన వారికంటే పెద్ద ద్రోహులని నిప్పులు చెరిగారు. నీళ్లు, ఉద్యోగాలు, భూములు, ఆస్తులు అన్నీ దోచుకున్నారని మండిపడ్డారు. ఇంకా దోపిడీకి గురి కాదల్చుకోలేదన్నారు. తెలంగాణ భూములను ముంచి పోలవరం ప్రాజెక్టును కట్టడానికి యత్నిస్తున్నారు. తెలంగాణను అడ్డుకొనేందుకు ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తే నష్టపోయేది విూరేనని హెచ్చరించారు. అపోహలు సృష్టించి అడ్డుకోవాలనుకోవడం భ్రమ అని అన్నారు. కృత్రిమం ఉద్యమాలు సృష్టిస్తే ప్రజల మధ్య విభేదాలు సృష్టించినట్లేనని తెలిపారు. డిసెంబర్‌ 9నాటి ప్రకటనను అడ్డుకొనేందుకు కేవీపీ, రోశయ్య, కిరణ్‌, చంద్రబాబు, చిరంజీవిలు ఏకమై రాజీనామాల డ్రామాలకు తెర లేపారని ఎంపీ వివేక్‌ విమర్శించారు. మళ్లీ తెలంగాణపై ప్రకటన రాబోతున్న తరుణంలో తెలంగాణ వ్యతిరేకులంతా ఏకమయ్యారని మండిపడ్డారు. సీఎం కిరణ్‌ ఆధ్వర్యంలోనే కుట్రలు జరుగుతున్నాయని, ఢిల్లీలో పావులు కదులుతున్నాయని ఆరోపించారు. సీమాంధ్ర ప్రజలు తెలంగాణకు వ్యతిరేకులు కారని, కొంత మంది నేతలు మాత్రమే వ్యతిరేకమన్నారు. అందుకే రాష్ట్ర విభజనకు అడ్డు పడుతున్నారని విమర్శించారు. అలాంటి వారికి ప్రజలే బుద్ది చెబుతారన్నారు.