విద్యారంగ సమస్యలపై ఆందోళన కార్యక్రమాలు

ఆదిలాబాద్‌, నవంబర్‌ 3 : జిల్లాలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఐక్యంగా పోరాటాలు చేస్తామని విద్యార్థి సంఘాల ఐక్య వేదిక జిల్లా అధ్యక్షుడు బి.రాజు తెలిపారు. విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయడం లేదని ఆయన విమర్శించారు. అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న కార్పొరేట్‌ కళాశాలల తీరుపై చర్చించేందుకు ఈ నెల 12వ తేదీన ఆదిలాబాద్‌లో అన్ని సంఘాలతో రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. ఇంటర్మీడియట్‌ బోర్డు అడ్మిషన్ల నోటిఫికేషన్‌ వెలువడక ముందే ఆంధ్రలోని కార్పొరేట్‌ కళాశాలలు అడ్మిషన్లు నిర్వహిస్తూ ప్రజలనుండి కోట్లాది రూపాయలు వసూళ్లు చేస్తున్నారని ఆరోపించారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆందోళనలు చేపట్టి వాటి పరిష్కారానికి ప్రభుత్వంపై  ఒత్తిడి తెస్తామని అన్నారు.