విద్యార్థునులతో పాఠశాలలో సేవలు

-ఎండ దెబ్బ తగిలి విద్యార్థునులు అనారోగ్యం పాలు

మహబూబాబాద్ బ్యూరో- సెప్టెంబర్16(జనంసాక్షి)

ఎర్రటి ఎండలో విద్యార్థునులతో గడ్డి పీకించి విద్యార్థునులను అనారోగ్యానికి గురయ్యేలా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఇచ్చిన పనిష్మెంట్ పై తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలోని ప్రధానోపాధ్యాయురాలు పుష్ప కుమారి విద్యార్థునులను పాఠశాలలో పనులకు వాడుకుంటూ విద్యార్థునులను నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఎవరికైనా చెప్తే ఆమె ఎలా ఇబ్బంది పెడతారో అని విద్యార్థునులు మనోవేదనకు గురవుతున్నారని తల్లిదండ్రులు ఆరోపించారు. శుక్రవారం ఎండలో విద్యార్థునులతో ఎర్రటి ఎండలో గడ్డి పీకించగా అందులో కొందరు అస్వస్థతకు గురై వాంతులు చేసుకుని అనారోగ్యానికి గురైనట్టు తల్లిదండ్రులు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో భద్రత కరువైందని వారు ఆవేదన వ్యక్తంచేశారు. ఇట్టి విషయంపై పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిని వివరణ కోరగా జడలు పైకి కట్టుకుని రమ్మంటే రాలేదన్న కారణంతో పనిష్మెంట్ కింద గడ్డి పీకించినట్టు ఆమె తెలిపారు.