విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు మెరుగైన వసతులు కల్పించాలి
-ఈశాన్య ప్రాంత అభివృద్ధి, సహాకార మంత్రిత్వ శాఖ కేంద్రమంత్రి బి.ఎల్ వర్మ
మహబూబాబాద్ బ్యూరో-సెప్టెంబర్4(జనంసాక్షి)
విద్యార్థుల కు నాణ్యమైన విద్య తో పాటు మెరుగైన వసతులు కల్పించాలని ఈశాన్య ప్రాంత అభివృద్ధి, సహాకార మంత్రిత్వ శాఖ కేంద్ర మంత్రి వర్యులు బి.ఎల్ వర్మ అన్నారు. మహబూబాబాద్ మండలం రెడ్యాల ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాలను ఆదివారం సాయంత్రం మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా వివిధ తరగతుల విద్యార్దులతో విద్యాబోధన పట్ల అడిగి తెలుసుకున్నారు. ఆంగ్ల మాధ్యమం పై విద్యార్థులకు పట్టు ఉండాలని కష్టపడి చదివి మంచి విద్యతో పాటు ఉన్నతమైన సంస్కారాన్ని నేర్చుకోవాలని విద్యార్థులకు మంత్రి సూచించారు. అనంతరం వంటశాల డైనింగ్ హాల్ ,మరుగుదొడ్లను, డార్మిటరీ గదులను మంత్రి పరిశీలించారు. వంటశాల బహిరంగ ప్రదేశంలో ఉందని ఆహార పదార్థాలపై దుమ్ము, ధూళీ పడకుండా తగు ఏర్పాట్లు చేయాలని డైనింగ్ హాల్ పరిశుభ్రంగా ఉందని మంత్రి అన్నారు. అదేవిధంగా మరుగుదొడ్లు, విద్యుత్చక్తి వ్యవస్థను మూడు రోజులలోపు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవాలని మంత్రి అన్నారు. అదేవిధంగా విద్యార్థులకు పౌష్టికాహారం తో పాటు స్వచ్ఛమైన, పరిశుభ్రమైన త్రాగునీటిని అందించాలని మంత్రి సూచించారు. విద్యార్థులు ఆరోగ్య వంతులుగా ఉన్నప్పుడే చదువు పట్ల ఏకాగ్రత కలిగి ఉంటారని విద్యార్థులకు విద్యతో పాటు ఆరోగ్య పరిరక్షణ సేవలు అందించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం విద్యా రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు విశేష కృషి చేస్తుందన్నారు. వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలల్లో ఉండే విద్యార్థులు తమ తల్లిదండ్రులకు దూరంగా ఉంటారని వారిని తమ సొంత పిల్లల్లాగా చూసుకొని మంచి విద్యతో పాటు సంస్కార వంతులుగా తీర్చిదిద్దాలని మంత్రి అన్నారు. ఇటీవల జిల్లాలో జరిగిన వజ్రోత్సవాలలో జరిగిన ఖోఖో పోటీలలో మొదటి స్థానంలో నిలిచిన విద్యార్థులకు మెడల్స్,ప్రశంసా పత్రాలను మంత్రి అందజేశారు. జిల్లా గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎర్రయ్య, మహబూబాబాద్ ఆర్డీవో కొమురయ్య, ఎంఆర్వో నాగభవాని, ప్రిన్సిపాల్ వెంకట్ రెడ్డి, వార్డెన్ మోహన్,తదితరులు పాల్గొన్నారు.