విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలి:హుస్నాబాద్ సీఐ కిరణ్
హుస్నాబాద్ రూరల్ సెప్టెంబర్ 10(జనంసాక్షి) విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలనీ హుస్నాబాద్ సీఐ కిరణ్ అన్నారు.హుస్నాబాద్ మండలం జిల్లెలగడ్డ లోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో స్వచ్ఛ గురుకుల కార్యక్రమంలో హుస్నాబాద్ సీఐ కిరణ్, ఎస్సై శ్రీధర్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గురుకుల పాఠశాల విద్యార్థులు వారికి ఘన స్వాగతం పలికారు. విద్యార్థులనుద్దేశించి సిఐ కిరణ్ మాట్లాడుతూ స్వచ్ఛ గురుకుల కార్యక్రమం చేసినప్పుడే పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం కాకుండా, విద్యార్థులు ప్రతిరోజు తమ చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యం కరమైన వాతావరణంలో బాగా చదువుకొని తమ లక్ష్యాన్ని సాధించి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. చెడు వ్యసనాలు, అసాంఘిక కార్యకలాపాల వైపు దృష్టి పెట్టకుండా లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలన్నారు. ఎస్సై శ్రీధర్ మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులని, క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని అలవర్చుకోవాలని, బాగా చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదిగి తల్లిదండ్రులు మరియు గురువుల పేర్లను నిలబెట్టాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి గురుకుల పాఠశాలల్లో ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా అన్ని సౌకర్యాలు కల్పిస్తూ మంచి బోధనను అందిస్తోందని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోని బాగా చదువుకోవాలనీ ఆకాంక్షించారు.