విద్యుత్‌కోతలను నిరసిస్తూ వ్యాపారుల ఆందోళన

ఆదిలాబాద్‌, అక్టోబర్‌ 18 ( జిల్లాలో విద్యుత్‌ కోతలపై విసుగు చెందిన వ్యాపారస్థులు ఆందోళన బాట చేపట్టారు. కరెంట్‌ కోతల వల్ల వ్యాపారం ముందుకు సాగకపోవడం తమకు తీవ్రనష్టాలు  వాటిల్లుతున్నాయని వ్యాపారస్థులు అంటున్నారు. అధికారికంగా ప్రకటించిన సమయాల్లో కాకుండా ఇష్టారాజ్యంగా విద్యుత్‌ కోతలు విధించడంతో ప్రజలతోపాటు పండుగ పూట సరిగా వ్యాపారం జరగడం లేదని వారు వాపోతున్నారు. ప్రభుత్వ చర్యలకు నిరసనగా గురువారం ఆదిలాబాద్‌లో చాంబర్‌ ఆఫ్‌ కామర్త్‌ ఆధ్వర్యంలో ఆదిలాబాద్‌లో ద్విచక్ర వాహన ర్యాలీని నిర్వహించారు. ఉదయం 10 గంటలకు స్థానిక నేతాజి చౌక్‌ నుండి పట్టణంలోని వీధుల గుంగా నిర్వహించిన ర్యాలీ విద్యుత్‌ కార్యాలయం వరకు కొనసాగింది. కార్యాలయం ముందు వ్యాపారస్థులు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం విద్యుత్‌ కోతలు లేకుండా చూడాలని విద్యుత్‌ శాఖ అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం అధ్యక్షులు రాజేశ్వర్‌, ప్రధాన కార్యదర్శి సందీప్‌లతోపాటు వివిధ వర్తక సంఘాల నాయకులు, వ్యాపారస్థులు పాల్గొన్నారు.