విద్యుత్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

ఆదిలాబాద్‌, నవంబర్‌ 9 : ప్రభుత్వం విద్యుత్‌ శాఖ ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని ఆ సంఘం కార్యదర్శి మధుసూదన్‌రెడ్డి ఆరోపించారు. ఎన్నో సంవత్సరాలుగా సమస్యలను పరిష్కరించాలని, ఉద్యోగులు, కార్మికులు విజ్ఞప్తి చేస్తున్నా పరిష్కరించకపోవడం వల్లే రిలే దీక్షలు చేపట్టినట్టు ఆయన పేర్కొన్నారు. స్థానిక ఎస్‌ఈ కార్యాయలం ఎదుట చేపట్టిన రిలే దీక్షలు శుక్రవారం నాటికి 5వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా మధుసూదన్‌రెడ్డి దీక్ష శిబిరాన్ని సందర్శించి మాట్లాడారు. యాజమాన్యం తమ సంఘంతో గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలను అమలు చేయడంలేదని ఆయన ఆరోపించారు. సంస్థలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేసి ఉద్యోగులపై అదనపు పని భారాన్ని తగ్గించాలని ఆయన డిమాండ్‌ చేశారు. విద్యుత్‌ శాఖలో ఒప్పంద కార్మికులను వెంటనే రెగ్యులర్‌ చేసి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళన కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.