విద్యుత్ కోతలతో తీవ్ర ఇబ్బందులు
ఆదిలాబాద్, జూలై 12: జిల్లాలో వేళాపాళా లేకుండా కరెంట్ కోతలు విధించడం వల్ల ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేసవి ముగియడంతో వర్షాకాలంలోనైనా విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం ఉన్నదనుకున్న వినియోదారులకు మళ్లీ విద్యుత్ కోతలు మొదలయ్యాయి. గత రెండు వారాలుగా సమయం, సందర్భంగా లేకుండా విద్యుత్ సరఫరాలో అంతరాయంతోపాటు అనధికారికంగా కోతలు విధిస్తూ వచ్చారు. గురువారం నుంచి అధికారికంగా కోతలు విధిస్తున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు ప్రకటనలు జారీ చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ కోతలు విధిస్తున్నామని విద్యుత్ శాఖ అధికారులు ప్రకటన చేయడంతో వినియోగదారులలో ఆందోళన మొదలయ్యాయి. ప్రతిరోజు 3.5 మిలియన్ల యూనిట్ అవసరం కాగా అందులో 20 శాతం విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో కోతలు విధించకతప్పడం లేదని అధికారులు పేర్కొన్నారు. జిల్లా కేంద్రమైన ఆదిలాబాద్లో 5 గంటలు, ఇతర పట్టణాలు, మున్సిపాలిటీలలో, మండల కేంద్రాలలో 6 గంటలపాటు కోతలు విధిస్తుండగా గ్రామాలలో సుమారు 12 గంటల కోత ఉంటుందని తెలిసింది. ఇకపోతే పరిశ్రమలకు వారంలో మూడు రోజులపాటు విద్యుత్ సెలవుగా ప్రకటించారు. జిల్లాలో చిన్నతహర, మధ్యతరహ పరిశ్రమలపై ఎంతో మంది ఉపాధి పొందుతుండడంతో ఈ విద్యుత్ కోతల వల్ల వారి ఉపాధికి తీవ్ర ఆటాంకం కలగనున్నది.