విద్యుత్ కోసం ప్రజల సామూహిక దీక్ష
ఆదిలాబాద్, జూలై 23 : తమ తమ కాలనీలలో విద్యుత్ సౌకర్యం కల్పించాలని గత 21 రోజులుగా కలెక్టర్ కార్యాలయం ముందు సాముహిక దీక్షలు చేపట్టిన అధికారులు స్పందించడం లేదని కాలనీ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని దాజినగర్, శాస్త్రీనగర్ కాలనీ వాసులు తమ కాలనీలలో విద్యుత్ సౌకర్యం కల్పించాలని సీపీఐ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు చేపట్టిన దీక్షలు మంగళవారంనాటికి 21వ రోజుకు చేరుకున్నాయి. ఈ కాలనీలలోని పేదల సమస్యల పరిష్కారం విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు. వర్షా కాలంలో విద్యుత్ సౌకర్యం లేకపోవడం అనేక ప్రమాదాలు సంభవిస్తున్నాయి. చీకటిలో పాములు, తేళ్లతో పిల్లలు, పెద్దలు భయంతో వణుకుతున్నారని వారు పేర్కొన్నారు. పట్టణానికి సమీపంలో ఉన్న కాలనీలలో ఈ పరిస్థితి ఉంటే మారుముల గ్రామాలలో ఏ విధంగా ఉంటుందోనని వారు అన్నారు. తమ సమస్యను పరిష్కరించేంతవరకు దీక్షలను కొనసాగిస్తామని అన్నారు.