విద్వేష రాజకీయాలు తెలంగాణలో చెల్లెవ్..!
టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య.
కుట్రపూరితంగా అసత్య ఆరోపణలు.
రాజన్న సిరిసిల్ల బ్యూరో, ఆగస్టు 23 (జనం సాక్షి). పోరాట స్వభావమున్న తెలంగాణ లో బిజెపి విద్వేష రాజకీయాలు చేల్లుబాటు కావని టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య అన్నారు. మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో నాయకులతో కలిసి తోట ఆగయ్య మాట్లాడారు. అమిత్ షా పర్యటనకు ముందుగానే లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితపై అసత్య ఆరోపణలు చేయడంపై మండిపడ్డారు. ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడం బిజెపికే సాధ్యమని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఎమ్మెల్సీ కవిత పనిచేశారని, కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోని అభివృద్ధిలో నమూనాగా నిలబెట్టిన సీఎం కేసీఆర్ కు వస్తున్న పేరు చూసి ఓర్వలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్ మహారాష్ట్ర లో బిజెపి చేసిన కుట్రలు ప్రపంచానికంత తెలుసని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో విద్వేష రాజకీయాలు రెచ్చగొట్టి లబ్ధి పొందాలని అనుకోవడం బ్రమే అవుతుందని తెలిపారు. నిజాం మెడలు వంచిన తెలంగాణ ప్రజలకు విద్వేషాలను అడ్డుకోవడం పెద్ద లెక్క కాదని అన్నారు. రెండు రోజులుగా బిజెపి నాయకులు చేస్తున్న విష ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. సమావేశంలో టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఆకునురి శంకరయ్య,బొల్లి రామ్మోహన్, గడ్డం నరసయ్య, కోమిరే సంజయ్ గౌడ్, ఎండి సత్తార్, తదితరులు పాల్గొన్నారు.