వినీలాకాశంలో బ్లడ్‌మూన్‌

నేడు సుదీర్ఘ చంద్రగ్రహణం

పరిశోధనలకు సిద్దమైన ఖగోళవేత్తలు

ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ప్రపంచ ప్రజలు

న్యూఢిల్లీ,జూలై26(జ‌నంసాక్షి): ఖగోళ అద్భుతంగా నిలిచిపోనున్న అరుదైన చంద్రగ్రణం వీక్షించేందుకు ప్రపంచం యావత్తూ సిద్దం అయ్యింది. శాస్త్రవేత్తలు పరిశోధనల కోసం నడుం బిగించారు. చంద్రగ్రహణం కారణంగా వినీలాకాశంలో మహత్తర దృశ్యం కనిపించనుంది. అరుదైన అరుణవర్ణ చందగ్రహణం శుక్రవారం ఏర్పడనుంది. రాత్రి 11 గంటల 54 నిమిషాలకు మొదలై అర్ధరాత్రి ఒంటిగంటకు సంపూర్ణ దశకు చేరుకోనుంది. మరో అద్భుతం కూడా దీనికి తోడు కానుంది. బ్లడ్‌ మూన్‌ ఓ వైపు కనువిందు చేయనుండగా అంగారక గ్రహం భూమికి అతి చేరువగా రానుంది. చంద్రుని పక్కనే ప్రకాశవంతంగా కనిపించనుంది. 2003 తర్వాత కుజుడు ఇలా రావడం ఇదే తొలిసారి. ఈ శతాబ్దిలోనే అత్యంత సుదీర్ఘమైన చందగ్రహణం ఒకవైపు, 15 ఏళ్ల తర్వాత భూమికి దగ్గరగా వచ్చే కుజగ్రహం మరోవైపు ఆకట్టుకోనున్నాయి. ఈ రెండు అద్భుతాలను వీక్షించి పరిశీలించేందుకు ఖగోళ శాస్త్రవేత్తలు సిద్దం అయ్యారు. ఒకే సరళరేఖపై ఉన్న సూర్య, చంద్రుల మధ్యలోకి భూమి వచ్చినప్పుడు చందగ్రహణం ఏర్పడుతుంది. సూర్యకాంతితో ధవళ వర్ణంలో మెరిసే జాబిల్లి ఆనాడు వెలవెలబోతుంది. ప్రతి నెలా భూమి, సూర్య, చంద్రులు ఒకే సరళరేఖ పైకి వస్తుంటారు. అయితే భూమి ఓ వైపునకు వంగి భ్రమించడం వల్ల దీని నీడ చంద్రుడి పై నుంచి లేదా కింద నుంచి వెళ్లిపోతుంటుంది. దీంతో గ్రహణం ఏర్పడదు. ఒక్కోసారి గ్రహణం ఏర్పడే సమయంలో.. భూ వాతావరణం గుండా పయనించే కాంతి చంద్రుడిపై పడుతుంది. దీంతో జాబిల్లి రక్త వర్ణంలో కనిపిస్తుంది. ఈ పరిణామాన్నే బ్లడ్‌ మూన్‌గా పిలుస్తారు. భూమిపై వాతావరణంలో మేఘాలు, పారదర్శకతపై ఇది ఆధారపడి ఉంటుంది. శుక్రవారం ఏర్పడే సంపూర్ణ చందగ్రహణం ఈ శతాబ్దంలోనే సుదీర్ఘమైనదిగా రికార్డు సృష్టించబోతోంది. భారత్‌, పాక్‌, దక్షిణాఫ్రికా, సౌదీ అరేబియా ప్రాంతాల్లో సంపూర్ణంగా గ్రహణం కనిపిస్తుంది. దక్షిణ అమెరికా, న్యూజీలాండ్‌, ఇరాన్‌, సూడాన్‌, టర్కీ, కజకిస్థాన్‌ లో పాక్షికంగా గోచరిస్తుంది. అమెరికా, ఆర్కిటిక్‌ ప్రాంతాల్లో అసలు కనిపించదు.