విపక్షాలు సహకరించాలి అన్ని అంశాలపై చర్చకు సిద్ధం: ప్రధాని
న్యూఢిల్లీ, నవంబర్ 22 :పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సజావుగా సాగేందుకు విపక్షాలు సహకరించాలని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ విజ్ఞప్తి చేశారు. దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను సమష్టిగా ఎదుర్కొనేందుకు సహచర సభ్యులంతా సహకరించాలని, సవాళ్లను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేయాలని ఆయన కోరారు. దయచేసి సభా సమయాన్ని వృథా చేయరాదని ఆయన హితవు పలికారు. పార్లమెంట్‌లో చర్చించాల్సిన అంశాలు చాలానే ఉన్నాయని.. ఎఫ్‌డీఐలతో సహా అన్ని అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధాని ప్రకటించారు. 28 రోజుల పాటు సాగనున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు సమావేశాల్లో పాల్గొనేందుకు పార్లమెంట్‌కు వచ్చిన ప్రధాని విూడియాతో మాట్లాడుతూ.. గురువారం నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాలు వాయిదా పడకుండా చూడాల్సిన బాధ్యత విపక్షాలపైనే ఉందని అన్నారు. విపక్షాలు లేవనెత్తే ఏ అంశంపైనైనా చర్చకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ‘ఏ అంశంపైననైనా నిబంధనలు, సంప్రదాయాల ప్రకారం చర్చ చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది’ అని చెప్పారు. ఉభయ సభలు సజావుగా సాగేందుకు, అర్థవంతమైన చర్చ జరిగేందుకు ప్రతిపక్షాలు సహకరిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రిటైల్ రంగంలోకి ఎఫ్‌డీఐలపై తృణమూల్ కాంగ్రెస్ ప్రవేశపెట్టనున్న అవిశ్వాస తీర్మానంపై ప్రశ్నించగా.. దేశం ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లను అధిగమించేందుకు పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రభుత్వానికి సహకరించాల్సిన బాధ్యత ప్రతిపక్షాలపైనా ఉందన్నారు. అనేక సమస్యలు ఉన్నాయని, వాటిని ఒక జాతిగా కలిసికట్టుగా ఎదుర్కొనేందుకు విపక్షాలు సహకరించాలని సూచించారు. సమావేశాలు సజావుగా సాగేందుకు అన్ని రాజకీయ పక్షాలు సహకరిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో కొనసాగుతుండడం వల్ల అది భారత్‌పైనా ప్రభావం చూపుతోందన్నారు. యువతకు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కల్పించాల్సిన అవసరం ఉందని, మౌలిక వసతుల రంగంతో పాటు ఆరోగ్యం, విద్య తదితర రంగాల్లో పెట్టుబడులు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ‘ఉభయ సభల్లో చాలా అంశాలు చర్చించాల్సి ఉంది. అందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలి’ అని మన్మోహన్ విజ్ఞప్తి చేశారు.