విప్లవతారకు తుదివీడ్కోలు


` మల్లు స్వరాజ్యం పార్థివ దేహానికి పలువురు రాజకీయ ప్రముఖులు, ప్రజాసంఘాల నేతలు నివాళి
` మెడికల్‌ కాలేజీకి భౌతికఖాయం అప్పగింత
హైదరాబాద్‌,మార్చి 20(జనంసాక్షి): తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం పార్థివ దేహానికి పలువురు రాజకీయ ప్రముఖులు, వివిధ ప్రజాసంఘాల నేతలు నివాళులర్పించారు. ప్రజలు, అభిమానుల సందర్శనార్థం సీపీఎం రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్‌కు ఆమె భౌతిక కాయాన్ని తరలించారు. అక్కడ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్సీ కవిత, సీపీఐ నేతలు నారాయణ, చాడ వెంకట్‌రెడ్డి, సీపీఎం నేతలు రాఘవులు, మధు, తమ్మినేని వీరభద్రం, ఎమ్మెల్సీ కవిత, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్‌ తదితరులు మల్లు స్వరాజ్యం పార్థివదేహం వద్ద నివాళులర్పించారు. ఆమెను కడసారి చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు ఎంబీ భవన్‌ వద్దకు చేరుకున్నారు. సాయుధ పోరాటంలో స్వరాజ్యం అందించిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. మల్లు స్వరాజ్యం భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్ధం పార్టీ కార్యాలయం ఎంబీ భవన్‌లో ఉంచారు. అటునుంచి నల్లగొండకు తరలించారు. మధ్యాహన్నం ఒంటి గంటకు పార్టీ కార్యాలయంలో నివాళి అర్పించారు. అంతిమయాత్రి నిర్వహించిన తర్వాత ఆమె పార్థివ దేహాన్ని మెడికల్‌ కాలేజీకి అప్పగించారు.కాగా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం మృతిపట్ల రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ సంతాపం తెలిపారు. సాయుధ పోరాటంలో స్వరాజ్యం సాహసం ఎందరికో స్ఫూర్తి అన్నారు. స్వరాజ్యం కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మల్లు స్వరాజ్యం పార్థివ దేహానికి రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి జగదీష్‌ రెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాజాకార్ల దుర్మార్గాలను ఎదురించిన ధీర వనిత మల్లు స్వారాజ్యం అన్నారు. ఆమె పోరాట స్ఫూర్తి నేటి యువతరానికి ఆదర్శమన్నారు.నిజాం నిరంకుశాన్ని ఎదురించిన ధీశాలి మల్లు స్వరాజ్యం అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. తెలంగాణలో గొప్ప యోధురాలి శకం ముగిసిపోయిందన్నారు. తెలంగాణ సమాజానికి స్ఫూర్తిగా నిలిచారని చెప్పారు. హైదరాబాద్‌లోని ఎంబీ భవన్‌లో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం భౌతికకాయానికి ఎమ్మెల్సీ కవిత నివాళులు అర్పించారు. స్వరాజ్యం కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం మాట్లాడుతూ.. తమలాంటి ఉద్యమకారులకు స్వరాజ్యం ఆదర్శంగా నిలిచారని చెప్పారు. తెలంగాణలో తుపాకీ పట్టిన మొదటి మహిళగా కీర్తి గడిరచారని తెలిపారు.మల్లు స్వరాజ్యంను పట్టిస్తే రూ.10 వేలు బహుమతిగా ఇస్తామని అప్పట్లోనే ప్రకటించడమంటే ఆమె ఎంత గొప్పగా పోరాటం చేశారో అర్థమవుతున్నదని చెప్పారు. రెండోదశ తెలంగాణ ఉద్యమంలోనూ అనేక సందర్భాల్లో ఆమె నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నామని వెల్లడిరచారు. వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు.మల్లు స్వరాజ్యం తూటాలా పేలే తన మాటను పాటగా మార్చి ప్రజలను, మహిళలను చైతన్య పరిచారన్నారని మంత్రి ఎర్రబెల్లి అన్నారు.తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని నిజాం సర్కారును ఎదిరించారని చెప్పారు. పాలకుర్తిలో చాకలి ఐలమ్మ, దేవులపల్లి వెంకటేశ్వరరావు, పుచ్చలపల్లి సుందరయ్య, భీం రెడ్డి నరసింహా రెడ్డి వంటి ఉద్దండులతో కలిసి మల్లు స్వరాజ్యం పనిచేశారని తెలిపారు. పాలకుర్తి ప్రాంతంతో ఆమెకు విడదీయరాని అనుబంధం ఉందని చెప్పారు. ఆమె జీవిత మహిళా లోకానికి, ఉద్యమాలకు ఆదర్శమని వెల్లడిరచారు.గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మల్లు స్వరాజ్యం (93).. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని కేర్‌ దవాఖానలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. ప్రజల సందర్శనార్థం ఆదివారం ఉదయం ఆమె భౌతికకాయాన్ని హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయం ఎంబీ భవన్‌లో ఉంచారు. అటునుంచి నల్లగొండకు తరలించారు. మధ్యాహ్నం ఒంటి గంటవరకు పార్టీ కార్యాలయంలో నివాళి అర్పించారు. అంతిమయాత్ర నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు ఆమె పార్థివ దేహాన్ని మెడికల్‌ కాలేజీకి అప్పగించారు.

 

తాజావార్తలు