విమర్శలు కాదు..ప్రశ్నలకు జవాబులేవీ
ప్రధాని మోడీకి కాంగ్రెస్‌తో పాటు నిజాలన్నా భయమే
ప్రధాని విమర్శలరై విరుచుకు పడ్డ రాహుల్
న్యూఢల్లీి,ఫిబ్రవరి8((జనం సాక్షి)): పార్లమెంట్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్‌పై చేసిన విమర్శలకు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ అంటే ప్రధాని మోదీకి చెప్పలేని భయమని, సత్యానికి కూడా మోదీ జంకుతారని ఎద్దేవా చేశారు. వీటికి ప్రతిరూపమే ప్రధాని మోదీ ప్రసంగమని రాహుల్ విరుచుకుపడ్డారు. తాము అడిగిన ప్రశ్నలకు మోదీ అసలు జవాబే ఇవ్వలేదని విమర్శించారు. చైనా, పాక్ సంబంధాలు, భారత్‌లోనే రెండు దేశాలు, రాజ్యాంగం గురించి ఈ మూడు అంశాలను తాను లోక్‌సభలో లేవనెత్తానని ఆయన వివరించారు. ’లోక్ సభ వేదికగా ప్రధాని తాము అడిగిన ప్రశ్నలకు జవాబులేవీ ఇవ్వకుండా దాటవేశారని మండిపడ్డారు. పాక్, చైనా విషయాన్ని మేము చాలా సీరియస్‌గా లేవనెత్తాం. అలా మాట్లాడాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. మా కుటుంబమే దేశానికి సేవ చేసింది. మాకు ఇతరుల సర్టిఫికేట్ అవసరమే లేదు’ అని రాహుల్ తేల్చి చెప్పారు. కోవిడ్ విషయంలో తమను అనవసరంగా ఆడిపోసుకుంటున్నారని, అప్పట్లోనే తాము కోవిడ్ కేసుల విషయంలో ప్రభుత్వాన్ని హెచ్చరించామని, తమ మాటలను, హెచ్చరికలను పెడచెవిన పెట్టారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. చైనా, పాక్ దగ్గరైన విషయంలో కూడా తాను హెచ్చరిస్తున్నానని, ఈ రెండు దేశాలు దగ్గరైతే, భారత్‌కు ప్రమాదమేనని రాహుల్ మరోసారి హెచ్చరించారు. మోదీ అనుసరిస్తున్న విదేశాంగ విధానంతో భారత్ చిక్కుల్లో పడే ప్రమాదముందని, మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విదేశాంగ నీతి కాలం చెల్లినదని రాహుల్ విరుచుకుపడ్డారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోదీ ఉభయ సభల్లోనూ ప్రసంగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ విధి విధానాలపై విమర్వలు గుప్పించారు. ప్రతిపక్షాల వల్లే కరోనా మరింత పెరిగిపోయిందని తీవ్ర విమర్శలు చేశారు.