విరాట్ కోహ్లి దూకుడు
అడిలైడ్: ఆస్ట్రేలియాతో అడిలైడ్ వేదికగా జరుగుతున్న మొదటి టీ20 మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు విరాట్ కోహ్లి (90 నాటౌట్: 55 బంతుల్లో 9×4, 2×6) చెలరేగి ఆడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ అరోన్ ఫించ్ టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. భారత్ ఓపెనర్లలో శిఖర్ ధావన్ (5) తక్కువ పరుగులకే పెవిలియన్ చేరి నిరాశపరిచినా.. రోహిత్ శర్మ (31: 20 బంతుల్లో 4×4, 1×6) మాత్రం తనదైన శైలిలో తొలి ఓవర్ నుంచే ఆసీస్ పేసర్లపై విరుచుకుపడి స్కోరు బోర్డును పరుగులెత్తించాడు. అయితే వాట్సన్ ఒకే ఓవర్‌లో రోహిత్, ధావన్‌లను వరుసగా ఔట్ చేయడంతో భారత్ 4.5 ఓవర్లలో 41/2తో నిలిచింది.
రాణించిన కోహ్లి- రైనా జోడి
ఆస్ట్రేలియా పర్యటనలో సూపర్ ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లిమరోసారి కంగారూలకు బౌండరీలతో చుక్కలు చూపించాడు. రోహిత్ ఔట్ అనంతరం క్రీజులో వచ్చిన కోహ్లి దూకుడుగా ఆడుతూ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ సురేశ్ రైనా (41: 34 బంతుల్లో 3×4, 1×6)తో కలిసి మూడో వికెట్‌కు ఏకంగా 134 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. చివరి ఓవర్‌లో రైనా ఔటైనా… కెప్టెన్ మహేంద్ర సింగ్ (11 నాటౌట్: 3 బంతుల్లో 1×4, 1×6) బ్యాట్ ఝళిపించడంతో భారత్ 188 పరుగులు చేయగలిగింది.