విశాఖ ఎయిర్‌పోర్టులో అయ్యన్నపాత్రుడు అరెస్ట్

విశాఖపట్నం: తెదేపా (TDP) సీనియర్‌ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు (Ayyannapatrudu)ను పోలీసులు విశాఖపట్నంలో అరెస్ట్‌ చేశారు. హైదరాబాద్‌ నుంచి ఎయిరిండియా విమానంలో విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయన్ను కృష్ణా జిల్లా హనుమాన్‌ జంక్షన్‌ పోలీసులు మఫ్టీలో వచ్చి తీసుకెళ్లినట్లు సమాచారం.

అనంతరం ఎలమంచిలి వద్ద 41ఏ నోటీసులు ఇచ్చి అయ్యన్నను విడిచిపెట్టారు.

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్రలో భాగంగా ఇటీవల ఎన్టీఆర్‌ జిల్లా గన్నవరంలో నిర్వహించిన సభలో చేసిన వ్యాఖ్యలపై పలువురు తెదేపా నేతలపై కేసు నమోదైంది. వైకాపాకు చెందిన మాజీ మంత్రి పేర్ని నాని ఫిర్యాదుతో అయ్యన్నపాత్రుడుపై 153A, 354A1(4), 504, 505(2), 509 ఐపీసీ సెక్షన్ల కింద పోలీసుల కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో విశాఖలోని స్థానిక పోలీసులకు సమాచారం లేకుండానే ఎయిర్‌ పోర్టు నుంచి అయ్యన్నను తీసుకెళ్లి ఆ తర్వాత విడుదల చేశారు.