విశాఖ రైల్వేజోన్ కల సాకారమవుతుంది
– విశాఖ భూ కుంభకోణంలో లోకేష్ పాత్ర
– జీవీఎల్‌పై టీడీపీ నేతల వ్యాఖ్యలు సరికాదు
– డీపీ ఎకౌంట్లు ఎందుకు పెరిగాయో సమాధానం చెప్పాలి
– బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్
విశాఖపట్నం, ఆగస్టు9(జనం సాక్షి) : విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ త్వరలోనే సాకారం కానుందని భాజపా శాసనమండలి సభ్యుడు పి.వి.ఎన్. మాధవ్ ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో నూతన అధికార ప్రతినిధుల పరిచయ సభలో ఆయన మాట్లాడారు. రాజకీయ నిర్ణయం మేరకు ఇబ్బందులు లేకుండా రైల్వేజోన్ ఏర్పాటు చేసేందుకు ప్రధానమంత్రి కార్యాలయం అధికారులు కృషి చేస్తున్నారని మాధవ్ తెలిపారు. రైల్వేజోన్ ఏర్పాటుపై తాము రాజ్‌నాథ్ సింగ్, పీయూష్ గోయల్‌ను కలిశామని, ఇప్పటికే భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా రైల్వేజోన్ త్వరలో ప్రకటించాలని లేఖ రాశారని మాధవ్ గుర్తుచేశారు. విశాఖలో భూ కుంభకోణాలకు సంబంధించి అధికారులు ఉత్తమ నివేదిక ఇచ్చినట్టు భావిస్తున్నామని.. ఇందులో ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడి ప్రమేయం కూడా ఉందని తెలుస్తోందన్నారు. కమిటీ ఇచ్చిన నివేదికను యధాతథంగా బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాజ్యసభ సభ్యుడు జి.వి.ఎల్.నరసింహరావుపై తెదేపా నేతలు అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని, ఆయన ఆరోపిస్తున్నట్లుగా డీపీ. అకౌంట్లు 36 వేల నుంచి 56 వేల కోట్ల మేరకు ఎందుకు పెరిగాయో తేల్చాలని కోరారు.