విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం

విశాఖపట్నం, జనవరి18(జ‌నంసాక్షి) : విశాఖ ఉక్కు కర్మాగారంలో సాంకేతిక కారణాలతో శుక్రవారం ఉదయం ప్రమాదం సంభవించింది. కర్మాగారంలోని బ్లాస్ట్‌ ఫర్నేస్‌ – 3లో బ్లో పైప్‌ పేలింది. దీంతో ఒక్కసారిగా ఫర్నేస్‌ నుంచి పెద్ద ఎత్తున మంటలు, ముడిసరకు బయటకు వెలువడ్డాయి. మంటల ధాటికి సవిూపంలో ఉద్యోగులు నిలిపి ఉంచిన ఏడు ద్విచక్ర వాహనాలు, ఇతర యంత్రాలు కాలిపోయాయి. వెంటనే సీఐఎస్‌ఎఫ్‌ ర్‌ విభాగం అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో ఉద్యోగులు అల్పాహారానికి వెళ్లడంతో పెద్ద ఎత్తున ప్రమాదం తప్పినట్లు తెలిపారు. అధికారులు, ఉద్యోగుల మధ్య సమన్వయం లేక సరైన నిర్వహణ లేకపోవడం వల్లే ఈ ప్రమాదానికి కారణమని ఆరోపణలు వెల్లువెత్తాయి. 24 గంటల్లో తిరిగి పని ప్రారంభించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.