వీఆర్ఏలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి.

సిఐటియు జిల్లా నాయకులు బొల్లం అశోక్ డిమాండ్.
తొర్రూరు 30.జూన్ (జనంసాక్షి )
రాష్ట్ర ప్రభుత్వం నిండు అసెంబ్లీలో ముఖ్యమంత్రి వీఆర్ఏలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సిఐటియు జిల్లా నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం స్థానిక తొర్రూరు తాసిల్దార్ కార్యాలయం ముందు రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా గేటు ముందు నిరసన చేస్తున్న వీఆర్ఏలకు సిఐటియు తొర్రూర్ మండల కమిటీ ఆధ్వర్యంలో సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ వీఆర్ఏలతో రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతంలో సర్వం చాకిరి చేయించుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం వారి హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆయన ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. గత మూడు సార్లు జరిగిన అసెంబ్లీ సమావేశాలలో అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ వీఆర్ఏలకు ఇచ్చిన హామీలు పెస్కేలు, 55 సంవత్సరాలు దాటిన వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు, అర్హత కలిగిన వీఆర్ఏలకు ప్రమోషన్లు ఇస్తామని ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ఇప్పటివరకు హామీలు నెరవేర్చకుండా వీఆర్ఏ ల పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వీఆర్ఏలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, లేనియెడల రాష్ట్రవ్యాప్తంగా వీఆర్ఏలు చేస్తున్న పోరాటాలకు అండగా ఉండి, వాళ్ల సమస్య పరిష్కారం అయ్యేవరకు అందరిని కలుపుకొని పోరాటాలు ఉధృతం చేస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల నాయకులు మార్క సాంబయ్య, వీఆర్ఏల సంఘం తొర్రూరు మండల అధ్యక్షులు డి. శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు సందీప్, కార్యదర్శి మురళి, సతీష్, శ్రావణ్ కుమార్, ప్రవీణ్, నర్మదా, వనిత, శిరీష, రాంబాబు, యాకూబ్, పాషా, రవి, ఖాజా, శోభ, రవి, చందర్, తదితరులు పాల్గొన్నారు.